మోజామ్ బెగ్ అంటే టెర్రర్....
లండన్: అనుమానిత టెర్రరిస్టులు, టెర్రరిజం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ముస్లిం యువత తరఫున పోరాడేందుకు 2003లో లండన్‌లో ఏర్పాటైన సంస్థ ‘కేజ్ (సీఏజీఈ)’. టెర్రరిస్టుల అణచివేత పేరిట ఇప్పుడు సిరియాపై పాశ్చాత్య దేశాలు జరుపుతున్న దాడులను సాకుగా చూపించి ముస్లిం యువతను టెర్రరిజం వైపు రెచ్చగొడుతోంది. ముఖ్యంగా కేజ్ డెరైక్టర్ మోజామ్ బెగ్ విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని తన వాక్చాతుర్యంతో విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. టెర్రరిజం వైపు వారిని ప్రోత్సహిస్తున్నారు. కాలిఫా రాజ్యస్థాపనే లక్ష్యమంటూ వారికి నూరిపోస్తున్నారు.
బెగ్ గత విద్యా సంవత్సరంలో బ్రిటన్‌లోని 11 విశ్వవిద్యాలయాల్లో 15 సార్లు ముస్లిం యువతను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు. బర్మింగమ్, మన్‌చెస్టర్, బ్రాడ్‌ఫోర్డ్, ఈస్ట్ లండన్ విశ్వవిద్యాలయాల వేదికపై ఆయన బహిరంగంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. హేతువాదులను, జీవించే హక్కు కోసం పోరాడుతున్న మానవ హక్కుల సంఘాల నేతలను అనుమతించని ఈ విశ్వవిద్యాలయాలు బెగ్ ప్రసంగాలను అనుమతించడం మీడియాకే ముక్కుమీద వేలేసుకునేలా చేశాయి. దాడుల ద్వారా టెర్రరిస్టులను నిర్మూలించడం కన్నా టెర్రరిజం వైపు యువత వెళ్లకుండా నిర్మూలించడమే ఉత్తమ విధానమని నమ్మిన బ్రిటన్ ప్రభుత్వం ఏటా 40 కోట్ల రూపాయలను ఆలక్ష్యం కోసం ఖర్చు చేస్తున్నా ఏం సాధిస్తున్నట్లు?
ఏ విశ్వవిద్యాలయంలోనైనా బెగ్ ప్రసంగం తీరు ఇలా ఉంటుంది....‘నాజీల సమయంలో యూదులను చూసినట్టు ఇక్కడి ప్రభుత్వం ముస్లింలను చూస్తోంది. సిరియాలో ఎంత మంది యువకులు పాశ్చాత్య దేశాల దాడుల్లో మరణిస్తున్నారో వీరికి పట్టదు. సిరియా తిరుగుబాటు దారులు ఒకరిద్దరిని చంపేస్తే అహో అన్యాయం జరిగిపోయిందన్నట్లు దానికెంతో ప్రాచుర్యం కల్పిస్తారు. అమాయక ముస్లింలను అరెస్టు చేసి వేధిస్తారు. ఐసిస్ దాడుల్లో మరణించిన ప్రతి పాశ్చాత్యుడి పేరు, ఊరుతో సహా మన దృష్టికి వస్తోంది. మరి వీరు చంపేసిన సిరియా పౌరుల్లో ఒక్కరి పేరు కూడా మనకు ఎందుకు వినిపించదు. టెర్రరిస్టు అనుమానితులుగా అరెస్టైన ముస్లిం యువకుల పేరు, ఊరు కాదుకదా! కనీసం వారెక్కడున్నారో కూడా మనకు తెలియదు. ఏమిటీ ఈ పరిస్థితి. బ్రిటన్‌లో కూడా ఖలీఫా రాజ్యం ఏర్పడితేనే ఈ పరిస్థితికి పరిష్కారం’ అని ఆయన పలు ప్రసంగాల్లో పిలుపునిచ్చారు.
ఓ ప్రసంగంలో పారిస్‌పై జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూ ‘ పిల్లలను కూడా పొట్టన పెట్టుకున్నారని ప్రభుత్వంతోపాటు దాని బాకాలైన మీడియా కూడా గోల చేసింది. నేను చెబుతున్నా ఇదింతా ఉట్టి ప్రచారమే. ఒక్కరంటే ఒక్క పిల్లాడు కూడా పారిస్ దాడిలో చనిపోలేదు’ అని చెప్పారు. పారిస్ దాడుల్లో చనిపోయిన 130 మంది పౌరుల్లో పిల్లలు కూడా ఉన్న విషయం తెల్సిందే. టెర్రరిస్ట్ నేపథ్యం ఉన్న మోజామ్ బెగ్‌పైనే కాదు. ఆయన నిర్వహిస్తున్న ‘కేజ్’పై కూడా బ్రిటన్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేక పోతోంది. ఇటీవల సంస్థ ఆర్థిక లావాదేవీలను మాత్రం స్తంభింపచేసింది.
అఫ్ఘానిస్తాన్‌లోని అల్ కాయిదా టెర్రరిస్టు శిక్షణా శిబిరాలను మూడుసార్లు సందర్శించిన బెగ్ 2002లో పాకిస్తాన్‌లో అమెరికా సైనికుల చేతుల్లో అరెస్టయ్యారు. గ్వాటెమాల బే జైల్లో గడిపారు. అనంతరం విడుదలయ్యాక తాను ఎలాంటి నేరం చేయకపోయినప్పటికీ తనను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ బ్రిటన్ కోర్టులో దావా వేశారు. ఆ కేసులో విజయం సాధించి ఏకంగా పది కోట్ల రూపాయల నష్ట పరిహారం పొందారు. ఆ డబ్బులో ఐదు కోట్ల రూపాయలను వెచ్చించి బర్మింగమ్‌లో ఐదు పడక గదుల విశాలమైన భవనాన్ని కొన్నారు. అందులో కారు గ్యారేజీ, కారు సౌకర్యం ఉంది. ఆయనకు భార్యా నలుగురు పిల్లలు ఉన్నారు. వారంతా హాయిగానే జీవిస్తున్నారు. కోర్టు కేసులో తనకు అండగా నిలిచిన కేజ్ సంస్థలో బెగ్ చేరి ఇప్పుడు దానికి డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. యువతను టెర్రరిజం వైపు ప్రోత్సహిస్తున్నారు.