మొజాంబిక్ తీరంలో ఎంహెచ్ 370 శకలం లభ్యం!
అదృశ్యమైన మలేసియా ఎయిర్లైన్స్ బోయింగ్ ఎంహెచ్ 370 విమానానికి చెందినదిగా భావిస్తున్న శకలాన్ని మొజాంబిక్ సముద్రతీరంలో గుర్తించారు. మలేసియా దర్యాప్తు బృందం అధికారులు ఈ శకలం ఫొటోలను పరిశీలిస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం ఈ విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే.
2014 మార్చి 8న మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు వెళ్తుండగా ఈ విమానం అదృశ్యమైంది. విమానంలో మొత్తం 239 మంది ఉన్నారు. గతేడాది ఎంహెచ్ 370 విమానానిదిగా భావిస్తున్న శకలం హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ దీవిలో కనుగొన్నారు. విమానం రెక్క, తోక భాగాలతో కూడిన శకలం లభ్యమైంది. కాగా మలేసియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ సిబ్బందిని రంగంలోకి దింపి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా విమానం కూలిన ప్రాంతాన్ని గుర్తించలేకపోయాయి. 46 వేల చదరపు మైళ్ల పరిధిలో ఇప్పటివరకు ముప్పావు భాగాన్ని శోధించినా ఫలితం లేకపోయింది.