నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, జాతీయ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్ట్ 18న విమాన ప్రమాదంలో చనిపోయారనే విషయాన్ని నమ్ముతున్నట్లు ఆయన కుమార్తె అనితా బోస్ (73) ప్రకటించారు. స్వాతంత్ర్య పూర్వమే ప్రపంచవ్యాప్తంగా ఎంతో బలమైన నాయకుడిగా ఎదిగిన తన తండ్రి నేతాజీ భారత్ తిరిగొస్తే, నెహ్రూకు మంచి బలమైన ప్రత్యామ్నాయంగా మారి ఉండేవారని ఆమె వ్యాఖ్యానించారు. జపాన్‌లోని రెంకోజీ దేవాలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అనితా బోస్ డిమాండ్ చేశారు. బోస్ 119వ జయంతి సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాని ప్రయత్నాల పట్ల అనితా బోస్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ మిస్టరీకి ఇప్పటికైనా ముగింపు పడుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.
తండ్రికి సంబంధించి ప్రత్యేక జ్ఞపకాలేవీ లేకపోయినప్పటికీ, ఆయన గొప్పదనం గురించి తల్లి ఎపుడూ చెబుతూ ఉండేవారన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి అని అనితా బోస్ కొనియాడారు. కొన్ని సమస్యలపై నెహ్రుకు, తన తండ్రికి అభిప్రాయాలు ఒకేలా ఉన్నా, విబేధాలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యంగా మత ఘర్షణలు, మతాధిపత్యం లేని రాజకీయ వ్యవస్థను ఇద్దరూ అభిలాషించారని తెలిపారు. అలాగే పారిశ్రామికీకరణను ఇద్దరూ కోరుకున్నా, పాకిస్తాన్ విషయంలో మాత్రం చాలా తేడాలున్నాయని ఆమె చెప్పారు. బోస్ బతికుంటే రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించేవారని, నెహ్రూకు ప్రత్యామ్నాయంగా కచ్చితంగా ఉండేవారని వ్యాఖ్యానించారు. పొరుగుదేశం పాకిస్తాన్తో సంబంధాలు మెరుగ్గా ఉండేలా ప్రయత్నించి, విజయం సాధించి వుండేవారని తెలిపారు.
తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ఒక వ్యక్తి, దేశానికి, రాజకీయాలకు, తన కుటుంబానికి సంబంధం లేకుండా ఒక బాబాగా ఎక్కడో పర్వతాల్లో బతికి ఉంటారనే విషయాన్ని ఎలా నమ్ముతామని అనితా బోస్ ప్రశ్నించారు. ఆయన బతికుంటే అందరికీ సంతోషమే కానీ, పర్వతాల్లో గుమనామి బాబా సంచరిస్తున్నారంటూ మతి లేని ప్రచారం చేయడం నేతాజీ ప్రతిష్టకే భంగకరమన్నారు. అలాగే దేశం కోసం జీవితాన్ని అర్పించిన వ్యక్తి మరణం వివాదాస్పద కావడం బాధ కలిగించిందన్నారు. దేశ ప్రజలు తన తండ్రిని ఆ వివాదం ద్వారా గుర్తు పట్టడం విచారించాల్సిన విషయమని అనితా బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో భారత్, జపాన్ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు. ప్రత్యేక నిపుణులతో అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. దశాబ్దాలుగా ఇంత అగౌరవమైన చర్చ జరుగుతున్నా జపాన్ ఈ నిజాలను బయట పెట్టకపోవడం ఆ దేశానికే అవమానకరమని చురకలంటించారు.
కాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి భారత ప్రభుత్వం వద్ద ఉన్న కొన్ని రహస్య పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోస్ 119వ జయంతి సందర్భంగా ఈ నెల 23వ తేదీన (శనివారం) బహిర్గతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరిగే కార్యక్రమానికి బోస్ కుటుంబ సభ్యులు, కొందరు నాయకులు హాజరవుతారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ గురువారం తెలిపారు. ఈ నేపథ్యంలో నేతాజీ కుమార్తె అనిత వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరి కొద్దిగంటల్లో ప్రభుత్వం వివరాలు బయటపెట్టనున్న తరుణంలో ఏడు దశాబ్దాలుగా ఉత్కంఠను రాజేసిన మిస్టరీకి ఇక తెరపడనుందా.. వేచి చూడాల్సిందే.