
బంగ్లాతో రక్త సంబంధం
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం రక్త సంబంధమని భారత ప్రధాని మోదీ అన్నారు.
కొత్త బంధంతో ఇరుదేశాలకు భరోసా
► ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాటం చేస్తామన్న మోదీ
► భారత్– బంగ్లాదేశ్ మధ్య 22 ఒప్పందాలపై సంతకం
► త్వరలో తీస్తా జలాలపైనా నిర్ణయమన్న మోదీ
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం రక్త సంబంధమని భారత ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఇరు దేశాలు భద్రత, పౌరఅణు రంగం సహా 22 కీలక ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్‌తో మా బంధాలను పెంచుకోవటం సంతోషంగా ఉంది. బంగ్లాతో మాది రక్త సంబంధం, తరతరాల బంధుత్వం. ఈ బంధాలు మా భవిష్యత్ తరాలకు, భద్రతా బలగాలకు మరింత భద్రత కల్పిస్తాయి’ అని అన్నారు.
‘ఉగ్రవాదం భారత్, బంగ్లాలకే కాదు.. ఈ ప్రాంతం మొత్తానికీ సవాల్ విసురుతున్నాయి. దీన్ని సంయుక్తంగా ఎదుర్కొంటాం’ అని షేక్ హసీనాతో సమావేశం తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మోదీ చెప్పారు. భారత–బంగ్లా సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని షేక్ హసీనా అన్నారు. ఇరు దేశాలు వివిధ అంశాలపై ఒప్పందాలు చేసుకున్నప్పటికీ.. రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తీస్తా నది జలాలపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే దీన్ని కూడా వీలైనంత త్వరగానే పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ.. బంగ్లా ప్రధానికి భరోసా ఇచ్చారు. తీస్తా నది జలాల విషయంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విముఖత తెలపటం కారణంగానే ఈ ఒప్పందంపై నిర్ణయం వెలువడలేదు. కాగా ఇరు దేశాల మధ్య కొత్త రైలు, బస్సు సర్వీసుల ప్రారంభోత్సవంలో మాత్రం మమత పాల్గొన్నారు. కోల్‌కతా–ఖుల్‌నా (బంగ్లా) మధ్య బస్సు సర్వీసు ప్రారంభమైంది. బంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధు షేక్ ముజబుర్ రహమాన్ (షేక్ హసీనా తండ్రి)కు గౌరవసూచకంగా ఢిల్లీలోని ఓ మార్గానికి ఆయన పేరు పెట్టారు.
ముఖ్యమైన ఒప్పందాలు
ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారానికి ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా బంగ్లాదేశ్‌కు మిలటరీ హార్డ్‌వేర్‌ను భారత్ సరఫరా చేస్తుంది. బంగ్లాదేశ్‌కు లైన్ ఆఫ్ క్రెడిట్ (విడతల వారిగా ఇచ్చే రుణం)లో భాగంగా 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.32వేల కోట్లు) అందించేందుకూ ఒప్పందం కుదిరింది. పౌరఅణు రంగంలో ఒప్పందం కారణంగా బంగ్లాలో భారత్ అణుకేంద్రాలు ఏర్పాటుచేసేందుకు వీలుంటుంది.
తీర ప్రాంతాల్లో ప్రయాణికులు, నౌకల సేవలను విస్తృత పరచటం, సైబర్ సెక్యూరిటీలో సహకారంపైనా ఒప్పందాలు జరిగాయి. ‘బంగ్లాదేశ్‌కు భారత్‌నుంచి వెళ్తున్న 600 మెగావాట్ల విద్యుత్ ప్రసారానికి అదనంగా మరో 60మెగావాట్ల విద్యుత్ పంపాలని నిర్ణయించాం. నుమాలీగఢ్–పార్బతిపూర్ డీజిల్ పైప్‌లైన్‌కు ఆర్థిక సాయం చేస్తాం’ అని మోదీ చేప్పారు.
డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీ (ఢాకా), డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (నీలగిరీస్–తమిళనాడు) మధ్య జాతీయ భద్రత విషయంలో సహకారానికి ఒప్పందం. సరిహద్దుల్లో నివాస సముదాయాల విషయంపై ఒప్పందం వంటి మొత్తం 22 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
మోదీ, హసీనా ‘దిగిపోండి’!
భారత, బంగ్లా ప్రధానుల సమావేశం తర్వాత ఒప్పందాలపై సంతకాల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇద్దరు ప్రధానులతోపాటుగా అక్కడున్న వారిని నవ్వించాయి. బంగబంధు ముజీబుర్ రహ్మాన్ జీవిత చరిత్ర హిందీ అనువాదాన్ని మోదీ, హసీనా వేదిక కిందకు వచ్చి విడుదల చేయాలనే ఉద్దేశంతో ‘మే ఐ నౌ రిక్వెస్ట్ ద టూ ప్రైమ్ మినిస్టర్స్ టు స్టెప్ డౌన్ (పదవి నుంచి తప్పుకోవాలి)’ అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా గొల్లుమన్నారు. ఆ అధికారి అంతటితో ఆగకుండా ‘వేదికపైనుంచి స్టెప్‌డౌన్ చేయని ప్రధానులిద్దరూ పుస్తకాన్ని ఆవిష్కరించాలని కోరుతున్నాను’ అని మరోసారి అన్నారు.