వావ్.. వాట్సప్‌లో మరిన్ని ఫీచర్లు!
వాట్సప్‌లో ఒక మెసేజి పంపిన తర్వాత అందులో ఏమైనా పొరపాటు.. అరెరె అంటూ నాలుక కరుచుకుని ఉంటే మళ్లీ దాన్ని సవరిస్తూ కొత్త మెసేజి పంపాల్సిందే తప్ప పాత దాన్ని ఏమీ చేయలేం. కానీ అది గతమే.
వాట్సప్‌లో ఒక మెసేజి పంపిన తర్వాత అందులో ఏమైనా పొరపాటు ఉంటే.. అరెరె అంటూ నాలుక కరుచుకుని మళ్లీ దాన్ని సవరిస్తూ కొత్త మెసేజి పంపాల్సిందే తప్ప పాత దాన్ని ఏమీ చేయలేం. కానీ అది గతమే. ఇందులో కొత్తగా ప్రవేశపెడుతున్న ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే. ఒకసారి పంపిన మెసేజిని 'అన్ సెండ్' చేయడం, లేదా దాన్ని ఎడిట్ చేయడం కూడా సాధ్యం అవుతుందట. ఇంతకుముందు మనం ఒక మెసేజి పొరపాటున పంపి, దాన్ని డిలీట్ చేసినా.. అది కేవలం మన ఫోన్లో మాత్రమే డిలీట్ అవుతుంది తప్ప అవతలి వాళ్ల ఫోన్లో అలాగే ఉండిపోతుంది. కానీ ఇప్పుడు వాట్సప్ కొత్తగా తేబోతున్న ఫీచర్ పుణ్యమాని అవతలి వాళ్ల ఫోన్లోంచి కూడా అది పోతుందని చెబుతున్నారు.
వాబీటాఇన్ఫో అనే సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. వాట్సప్ బీటా వెర్షన్‌లో కొత్తగా రివోక్ అనే బటన్ ఉంటుందని, దాన్ని ట్యాప్ చేస్తే పంపిన మెసేజ్ కూడా పోతుందని అంటున్నారు. కేవలం మెసేజ్‌లు మాత్రమే కాదు.. పొరపాటున పంపిన ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు.. ఇలా ఏవైనా కూడా అలాగే తీసేయొచ్చని వివరించారు. ప్రస్తుతానికి ఇది అందరికీ అందుబాటులో లేదు గానీ, త్వరలోనే వచ్చేస్తుందని హామీ ఇస్తున్నారు.
ఇంతకుముందు గత సంవత్సరం నుంచి జీమెయిల్ కూడా ఇలాంటి ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పొరపాటున ఒక మెయిల్ పంపినా, దాన్ని కావాలంటే అన్‌డూ చేయొచ్చు. అలా చేస్తే, అవతలివాళ్ల ఇన్‌బాక్స్ లోంచి కూడా అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు వాట్సప్‌లో ఇది వస్తే.. అందులో రెండో అతిపెద్ద అప్‌గ్రేడ్ అవుతుంది. ఇంతకుముందు ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు వెర్షన్ల కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని వాట్సప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది భారతదేశం సహా 180 దేశాల్లో వచ్చింది. ఆండ్రాయిడ్ పాతవెర్షన్లు సహా ఐఫోన్ పాత వెర్షన్లలోను, కొన్ని విండోస్ ఫోన్లలోను వాట్సప్ పనిచేయదంటూ ఒక బాంబు కూడా పేల్చిన సంగతి తెలిసిందే.