
హెచ్‌ఐవీ నివారణకు కొత్త జెల్
ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్‌ఐవీని సమర్థంగా అడ్డుకునేందుకు సరికొత్త జెల్ వంటి ఓ మెత్తని పదార్థాన్ని భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది.
వాషింగ్టన్: ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్‌ఐవీని సమర్థంగా అడ్డుకునేందుకు సరికొత్త జెల్ వంటి ఓ మెత్తని పదార్థాన్ని భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది. సముద్రమొక్కల నుంచి సేకరించిన కారాగీనన్ అనే పాలీశాకరైడ్‌తో వైరస్ నిరోధక ఔషధం టీనోఫోవిర్‌ను కలిపి ఉపయోగించేందుకు వీలుగా ఈ జెల్‌ను తయారు చేశారు. దీనిలో టీనోఫోవిర్‌ను నింపి స్త్రీ యోనిలోకి ప్రవేశపెట్టడం ద్వారా అరక్షిత శృంగారం జరిపినా కూడా హెచ్‌ఐవీ వ్యాప్తి చెందదని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధన బృందం సారథి టోరల్ ఝవేరీ తెలిపారు.
హెచ్‌ఐవీ, ఇతర వైరస్‌లను నివారించే మందులను జెల్‌తో మాత్రమే కాకుండా నురగ, క్రీము, స్పాంజ్, ఫిల్మ్‌ల ద్వారా కూడా ఉపయోగించవచ్చన్నారు. ఇంతవరకూ హెచ్‌ఐవీ నిరోధక జెల్‌లు జంతు ఉత్పత్తుల నుంచి సేకరించే జెలాటిన్ పదార్థంతో తయారు చేశారని, తాము మాత్రం పూర్తి శాకాహార పదార్థాలతోనే ఈ జెల్‌ను సృష్టించామని పేర్కొన్నారు.