
అందుకే ఒక్క తూటా పేల్చలేదు: ప్రధాని మోదీ
సెయింట్ పీటర్స్‌బర్గ్: ఇరవై ఏళ్ల కింద ఉన్న ప్రపంచం ఇప్పుడు పూర్తి స్థాయిలో మారిపోయిందని, దేశాల మధ్య సంబంధాలు పెరిగాయని రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సు-2017లో మోదీ ప్రసంగిస్తూ.. చైనాతో భారత్ సంబంధాలు మెరుగయ్యాయని, 40 ఏళ్ల కిందటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఈ నాలుగు దశాబ్దాలలో ఇరు దేశాల సరిహద్దుల్లో ఒక్క తూటా పేలకపోవడమే ఇందుకు నిదర్శనమని మోదీ చెప్పారు.
మరోవైపు అకాశమే హద్దుగా భారత్‌లో అభివృద్ధి జరుగుతుందని, ప్రపంచం ఆసియా దేశాలపై దృష్టి సారిస్తోందని.. ముఖ్యంగా భారత్‌పై ఇతర దేశాల నమ్మకం రెట్టింపు అయిందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు అభివృద్ధి చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోందని, అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు. దేశంలో ఎన్నో సమస్యలున్నా.. డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలతో వీటిని సులువుగా అధిగమిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ స్థిరత్వంతో పారదర్శక పాలన కొనసాగిస్తున్నామని, సరిహద్దు దేశాలతో మైత్రి బంధాన్ని బలపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు.
నిన్న వ్యూహాత్మక చర్చలు జరిపిన మోదీ–పుతిన్ ఆ తర్వాత ఐదు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుదుత్పత్తి కేంద్రంలోని 5,6 యూనిట్ల నిర్మాణానికి రష్యా అంగీకరించింది. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదం, వాణిజ్యంతోపాటు పలు రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి.