ఫేస్ బుక్ పై మహిళ సంచలన ఆరోపణలు
మంచి జీతం, ఉచిత భోజనం, అన్నింటికీ మించి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో ఉద్యోగం... ఫేస్ బుక్ లో జాబ్ అనగానే మదిలో మెదిలే భావన ఇది. సోషల్ మీడియా దిగ్గజ సంస్థలో పని వాతావరణం ఊహించిన దాని కంటే భిన్నంగా ఉంటుందని ఫేస్ బుక్ మాజీ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కోపం, నిరుత్సాహం, మాట్లాడడానికి విల్లేని విధంగా ఆఫీస్ వాతావరణం ఉంటుందని ఫేస్ బుక్ ట్రెండింగ్ టీమ్ లో కాంట్రాక్టర్ గా పనిచేసిన మహిళా ఒకరు వెల్లడించారు.
న్యూస్ క్యూరేటర్ గా పనిచేసిన ఆమె ఫేస్ బుక్ కార్యాలయంలోని పూర్ మేనేజ్ మెంట్ గురించి దిగ్బ్రాంతికర విషయాలు చెప్పింది. భయం, పక్షపాతం, లింగ వివక్ష కారణంగా 2014 నుంచి 40 నుంచి 50 మంది ఉండే ట్రెండింగ్ టీమ్ నుంచి 15 మంది రాజీనామా చేసి వెళ్లిపోయారని తెలిపింది. ట్రెండింగ్ టీమ్ లో 10 మంది మహిళలు ఉండేవారని, కానీ ఎక్కువగా మగాళ్లనే ప్రోత్సహిస్తుంటారని 'గార్డియన్' పత్రికతో చెప్పారు. మాట్లాడేందుకు మహిళలకు అవకాశాలు తక్కువని, మగాళ్లు మాట్లాడుతున్నప్పుడు తామంతా నోరు తెరవడానికి వీల్లేదన్నారు.
మహిళా ఉద్యోగులను మేనేజర్లు, ఎడిటర్లు వేధిస్తుంటారని చెప్పారు. అయితే రాజకీయ పక్షపాతం లేదని వెల్లడించారు. ట్విటర్ వాడకుండా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటారని వెల్లడించారు. సరైన షెడ్యూలు, సమాచారం ఇవ్వకుండానే టార్గెట్ సాధన కోసం ఒత్తిడి తెస్తారన్నారు. ఫేస్ బుక్ ఇంటర్నల్ టీమ్స్ చెప్పినట్టే నడుచుకోవాలని, ఎదురు అసలు వీల్లేదన్నారు. మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలపై ఫేస్ బుక్ స్పందించింది. ఆమె లేవనెత్తిన అంశాలు చాలా ప్రధానమైనవని, దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది.