
ఇస్లామాబాద్: కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పుల్వామా తరహా దాడి జరగొచ్చంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ పరిణామాలపై చర్చించేందుకు మంగళవారం సమావేశమైన పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘పుల్వామా తరహా దాడి జరిగేందుకు అవకాశం ఉంది. వాళ్లు(భారత్) నింద మనపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు మళ్లీ మనపై దాడి చేయవచ్చు. అయితే, మనం తిప్పి కొడతాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు గెలుస్తారు? ఎవరూ గెలవలేరు.
ఆ తీవ్ర ప్రభావం మాత్రం అంతర్జాతీయంగా ఉంటుంది. ఇది అణ్వస్త్ర దేశం బెదిరింపు కాదు’అని ఇమ్రాన్ అన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. కశ్మీరీలు నిరసనలు తెలిపితే భారత్ వారిని అణచివేయవచ్చు. కశ్మీర్ పరిస్థితులను గమనిస్తూ ఉండాలి’అని ఆయన అంతర్జాలతీయ సమాజాన్ని కోరారు. కశ్మీరీలకు అవసరమైన ఎలాంటి సాయం చేసేందుకయినా తమ సైన్యం సిద్ధంగా ఉందని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా తెలిపారు. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు ఎంతదాకైనా వెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని జనరల్ బజ్వా పేర్కొన్నారు. కశ్మీర్ ప్రత్యేకప్రతిపత్తిని రద్దు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోందని హెచ్చరిస్తూ పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి గత వారమే ఐరాసకు లేఖ రాశారు.