జాదవ్ వీడియోను విడుదల చేసిన పాక్ అధికారులు (పాత దృశ్యం)
ఇస్లామాబాద్ : భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారంలో పాకిస్థాన్ వేగంగా పావులు కదుపుతోంది. జైల్లో ఉన్న జాదవ్ ‘భారత గూఢాచారి’ అని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయస్థానం లభించిన క్లియరెన్స్‌తో భారత్ నుంచి జాదవ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది.
‘పట్టుబడే సమయంలో జాదవ్ భారత నేవీ అధికారిగా కొనసాగుతున్నారు’’ ఇది పాక్ బలంగా వినిపిస్తున్న ఆరోపణ. దీనిని నిరూపించేందుకు తగిన సమాచారం సేకరించేందుకు ఐసీజే నుంచి ప్రత్యేక అనుమతిని పొందింది. దీంతో తాజాగా పాక్ భారత విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. ‘జాదవ్ వ్యక్తిగత విషయాలు, ఆయన ఉద్యోగంలో చేరిన తేదీ-విరమణ పొందిన తేదీ, పాస్‌పోర్ట్ వివరాలు, బ్యాంక్ అకౌంట్, పెన్షన్ తదితర అంశాలపై పూర్తి వివరాలను తమకు ఇవ్వాలి’’ అని పాక్ కోరింది. ఆ లెక్కన్న పట్టుబడిన సమయంలో జాదవ్ విధుల్లో ఉన్నాడా? లేదా? అన్నది ఈ రకంగా ధృవీకరించుకోవాలని పాక్ భావిస్తోంది.
పాస్ పోర్టే కీలకం...
మరీ ముఖ్యంగా పాస్ పోర్టు అంశంపైనే పాక్ ప్రధానంగా దృష్టిసారించినట్లు సమాచారం. హుస్సేన్ ముబాకర్ పటేల్ పేరు మీద ఉన్న పాస్‌పోర్టుతో జాదవ్ పుణే నుంచి ఇరాన్ కు ఆయన ప్రయాణించారనే పాక్ ఆరోపిస్తోంది. అంతేకాదు ముంబై, దుబాయ్ ఇలా 18 ప్రాంతాల్లో ఆయన ఇదే పాస్ పోర్టు మీద ప్రయాణించారంటోంది. అలాంటప్పుడు అది ఆయన ఒరిజినల్ పాస్‌పోర్టు అవునా? కాదా? అన్నది భారత్ నిర్ధారించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆస్తుల వివరాలను కూడా కోరినట్లు తెలుస్తోంది.
ముంబై, పుణే, మహారాష్ట్రంలో హుస్సేన్ ముబారక్ పేరు మీద ఉన్న ఆస్తులు జాదవ్‌కు చెందినవేనని పాక్ అనుమానిస్తోంది. 13 మంది ఇండియన్ అధికారుల పేర్లను ఈ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా, ఓ ‘రా’ మాజీ అధికారి(వీరిద్దరే జాదవ్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నారని పాక్ ఆరోపణ), నిఘా, బ్యాంక్, పాస్‌పోర్టు అధికారులకు పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లేఖల వ్యవహారంపై విదేశాంగ శాఖ మాత్రం స్పందించటం లేదు.
2016 మార్చిలో బెలూచిస్తాన్ ప్రాంతంలో తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్ర కుట్రలు పన్నారన్న ఆరోపణలపై పాక్ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఆ సమయంలోనూ ఆయన విధుల్లో ఉన్నారంటూ పాక్ వాదిస్తూ వస్తోంది. కానీ, ఆయన పదవీ విరమణ పొందారని.. వ్యాపారం నిమిత్తం ఇరాన్ వెళ్లిన అతన్ని కిడ్నాప్ చేసి మరి పాక్ జైల్లో బంధీగా ఉంచారని భారత్ చెబుతోంది.
జాదవ్‌పై మరో కేసు...
అంతర్జాతీయ న్యాయస్థానం ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేయటంతో మరో కుట్రకు పాక్ తెరలేపింది. జాదవ్‌పై మరో కేసును బనాయించింది. ఉగ్రవాదం, మోసం, విద్రోహ చర్యలు కింద జాదవ్‌పై తప్పుడు కేసులు బనాయించి దర్యాప్తు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment