నవాజ్ వైదొలిగే వరకూ ఆందోళన
పాక్ ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో ఇమ్రాన్‌ఖాన్ ఉద్ఘాటన
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ రాజీనామా చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని రెండు వేర్వేరు ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలకు నేతృత్వం వహిస్తున్న పాక్ నేతలు ప్రకటించారు. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటుతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలను కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నవాజ్ రాజీనామాకు పట్టుపడుతూ చేపట్టిన రెండు వేర్వేరు నిరసన ర్యాలీలు శనివారం ఇస్లామాబాద్ చేరాయి. వీటిలో ఒకదానికి ప్రతిపక్ష నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వం వహిస్తుండగా.. మరోదానికి కెనడాకు చెందిన మతపెద్ద తహీరుల్ ఖాద్రీ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
గతేడాది జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వారు ఆరోపిస్తూ తాజాగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ కార్యకర్తలు వేలాదిమంది ‘ఆజాదీ మార్చ్’ పేరిట లాహోర్ నుంచి దాదాపు 300 కిలోమీటర్లకుపైగా దూరం పయనించి ఇస్లామాబాద్ చేరుకున్నారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఇమ్రాన్‌ఖాన్ భారీ వర్షం కురుస్తున్నా లెక్కచెయక ఉద్యమకారులనుద్దేశించి మాట్లాడారు. గత ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని స్పష్టం చేశారు. దేశానికి నిజమైన స్వాతంత్య్రం లభించేవరకూ దీక్ష చేస్తానన్ని ప్రకటించారు. నవాజ్ పదవి నుంచి తప్పుకుని తిరిగి ఎన్నికలకు ఆదేశించేవరకూ ఇక్కడినుంచి కదలబోనన్నారు. గత ఎన్నికల్లో రిగ్గింగ్‌పై తాము ఎన్నికల కమిషన్‌ను, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని, దీంతో న్యాయంకోసం తాము వీధుల్లోకి రావాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తహీరుల్ ఖాద్రీ నేతృత్వంలో చేపట్టిన ‘రివల్యూషన్ మార్చ్’ కూడా ఇస్లామాబాద్‌లోని వేరొక ప్రదేశానికి చేరింది. వేలాది మంది ఆందోళనకారులు ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వం రాజీనామా చేయాలని, అసెంబ్లీలనూ రద్దు చేయాలని ఖాద్రీ డిమాండ్ చేశారు.