
మనుషులకు, జంతువులకు మధ్య స్నేహం చాలా అరుదుగా ఉంటుంది. కుక్కల తర్వాత మనుషులతో స్నేహం చేయగలిగే జీవుల్లో ఏనుగులు కూడా ఒకటి. ఒకసారి వాటికి అలవాటైతే ఎంతో ప్రేమిస్తాయి. అప్పుడప్పుడు తమ వారిని ఆటపట్టిస్తుంటాయి. అలాంటి ఘటనే థాయిలాండ్‌లోని ఓ జూపార్క్‌లో చోటు చేసుకుంది. జూలో ఏర్పాటు చేసిన కంచెకు రంగులు వేస్తున్న జూ కీపర్‌ను ఓ గున్న ఏనుగు సరదాగా ఆటపట్టించింది. అతను రంగు వేయకుండా కంచె పై నుంచి తన తొండంతో తడిమింది. గున్న ఏనుగు ఫన్నీగా పెయింటర్‌తో ఆడిన ఆట వీడియోను ఎంపీ పరిమల్ నత్వానీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో గతేడాది థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మైలో షూట్ చేసినదని, ఆ గున్న ఏనుగు పేరు ఖున్సుక్ అని, పెయింటర్ పేరు డాన్ డయీంగ్ అని ఓ జాతీయ వార్తా సంస్థ పేర్కొంది.
ఇక వీడియో ప్రకారం.. డాన్ డయీంగ్ అనే పెయింటర్ జూలో ఏర్పాటు చేసిన కంచెకు రంగు వేస్తున్నాడు. ఇంతలో ఎన్‌క్లోజర్‌లో నుంచి ఖున్సుక్ అనే గున్న ఏనుగు డాన్ డయీంగ్ దగ్గరకు వచ్చింది. రంగులేస్తుంటే..ఖున్సుక్ కంచె పై నుంచి తన తొండంతో డాన్ డయీంగ్‌ను తడిమింది. డాన్ డయీంగ్ మాత్రం తన పని చేసుకోవాలన్నట్లుగా ఏనుగుకు సైగ చేశాడు. అయితే గున్న ఏనుగు మాత్రం అతన్ని వదల్లేదు. కంచెపై నుంచి తొండంతో అతన్ని తాకుతూ..కాళ్లు పైకి లేపి ఎన్‌క్లోజర్ నుంచి వచ్చేందుకు ప్రయత్నించింది. డాన్ డయీంగ్ ఇక చేసేదేమి లేక కాసేపు ఆ ఏనుగుతో సరదాగా ఆడుకున్నాడు. చూడడానికి చాలా ఫన్నీగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే ..5వేలకుపైగా వ్యూస్ వచ్చాయి.