హ్యూస్టన్: ఎన్‌ఆర్‌జీ స్టేడియంలోకి 10.30 గంటల సమయంలో(భారత కాలమానం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేడియంలోకి వచ్చారు. అనంతరం మోదీ, ట్రంప్ కలిసి వేదిక పైకి వచ్చారు. వస్తూనే స్నేహితుడిలా ట్రంప్ చేతిని మోదీ పైకి చేపి ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఆ తరువాత త్రివర్ణ వస్త్రధారణలో ఉన్న బాలబాలికలు భారత జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం మోదీ గుడ్ మార్నింగ్ హ్యూస్టన్, గుడ్ మార్నింగ్ టెక్సస్, గుడ్ మార్నింగ్ అమెరికా.. గుడ్ ఈవినింగ్ భారత్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తన తొలి ప్రసంగం(ట్రంప్ ప్రసంగించిన తరువాత మోదీ మరోసారి ప్రసంగించారు)లో ట్రంప్‌ను మోదీ పొగడ్తల్లో ముంచెత్తారు. తదుపరి ఎన్నికల్లోనూ ట్రంప్ విజయభేరీ మోగిస్తారని జోస్యం చెప్పారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
హ్యూస్టన్ టు హైదరాబాద్
‘‘ఈ రోజు మనతో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. పరిచయం అక్కర్లేని పేరు, ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతీ రాజకీయ చర్చలోనూ ఏదో ఒక సందర్భంలో ప్రస్తావనకు వచ్చే పేరు.. ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఆయనకు స్వాగతం పలకడం గౌరవంగా భావిస్తున్నాను. ట్రంప్ నాకు మంచి మిత్రుడు. అమెరికా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే చెబుతున్నా.. అబ్ కీ బార్.. ట్రంప్ కీ సర్కార్ (మళ్లీ ట్రంప్ ప్రభుత్వమే). ఈ కార్యక్రమం రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల అనుబంధానికి తార్కాణం.
హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ వరకు, బోస్టన్ నుంచి బెంగళూరు వరకు, షికాగో నుంచి షిమ్లా వరకు, లాస్ ఏంజెలిస్ నుంచి లూధియానా వరకు, న్యూజెర్సీ నుంచి న్యూఢిల్లీ వరకు ఈ అనుబంధం పెనవేసుకుని ఉంది. నేను మొదటిసారి వైట్‌హౌజ్‌కు వచ్చినప్పుడు మీరు(ట్రంప్) నాకు మీ కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఇప్పుడు నేను మీకు నా కుటుంబాన్ని పరిచయం చేస్తాను. ఎదురుగా ఉందే(స్టేడియంలోని ప్రజలను చూపిస్తూ).. అదే నా కుటుంబం. 130 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం. మీకు(స్టేడియంలోని వారికి) భారత్‌కు అత్యంత గొప్ప మిత్రుడిని పరిచయం చేస్తాను. ఈయనే ది గ్రేట్ డొనాల్డ్ ట్రంప్’’ అంటూ పరిచయం చేశారు.
మోదీకి హ్యూస్టన్ తాళాలు
హ్యూస్టన్: మోదీ రాక సందర్భంగా హ్యూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ వినూత్న స్వాగతం పలికారు. ఆ నగర తాళాలను మోదీకి బహూకరించారు. చాలా కాలంగా కొనసాగుతున్న భారత–హ్యూస్టన్ సంబంధాల నేపథ్యంలో గౌరవార్థం దీన్ని అందజేశారు. అనంతరం మేయర్ టర్నర్ మాట్లాడుతూ తమ దేశంలోకెల్లా హ్యూస్టన్ నగరం అత్యంత భిన్నత్వం కలిగిందని తెలిపారు. హౌడీ అన్న పదాన్ని ఇక్కడ 140 భాషల్లో చెప్పుకుంటారని వెల్లడించారు. ఈ రోజు హౌడీని మోదీకి చెబుతున్నామని అన్నారు. దాదాపు 12 మంది గవర్నర్లు, యూఎస్‌కాంగ్రెస్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమెరికాలో భారతీయులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో హ్యూస్టన్ కూడా ఒకటి.
దేశం బయటా ‘స్వచ్ఛత’
దేశంలోనే కాదు, వెలుపల కూడా ప్రధాని మోదీ శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారనడానికి ఈ ఘటనే ఉదాహరణ. వివరాలివీ.. శనివారం రాత్రి హ్యూస్టన్‌లోని జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీకి అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. వారిచ్చిన పుష్పగుచ్ఛం నుంచి ఓ పువ్వు జారి కింద పడిపోయింది. ప్రధాని మోదీ వెంటనే ఆ పువ్వును కిందికి వంగి తీసుకున్నారు. ప్రధానే స్వయంగా ఇలా చేయడం చూసి, అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు.
హ్యాపీ బర్త్‌డే మోదీ
హూస్టన్: హౌడీ మోదీలో ట్రంప్ ప్రసంగిస్తూ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన మోదీ 69వ జన్మదిన వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడు ప్రసంగించేందుకు ఉపయోగించిన బల్లపై అధ్యక్షుడి ముద్రకు (ప్రెసిడెన్షియల్ సీల్) బదులు ఇరుదేశాల జెండాలతో కూడి చిత్రాన్ని ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment