
3డి ప్రింటింగ్ ఫేసు
లండన్: రోడ్డుప్రమాదంలో తీవ్రం గాయాలపాలైన వ్యక్తికి ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యులు 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో కొత్త ముఖాన్ని అమర్చారు. వైద్యశాస్త్ర చరిత్రలో ఒక వ్యక్తికి 3డి టెక్నాలజీ ద్వారా కొత్త ముఖాన్ని అమర్చడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌కు చెందిన స్టెఫెన్ పవర్(29) గతేడాది రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో అతడి ముఖం తీవ్రంగా దెబ్బతింది. దవడ ఎముకలు పూర్తిగా విరగడంతో నాలుగు నెలలుగా ఆసుపత్రిలోనే చికిత్సపొందుతున్నాడు.
ఈ నేపథ్యంలో మెరిస్టన్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం స్టెఫెన్ ముఖానికి ఎనిమిది గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి, విజయవంతంగా అతడి పూర్వపు రూపాన్ని తీసుకొచ్చారు. అయితే శస్త్రచికిత్సకు ముందు వైద్యుల బృందం స్టెఫెన్ తొలిరూపాన్ని సి.టి. స్కాన్ తీసి, 3డి మోడల్ ముఖాన్ని తయారు చేసింది. తర్వాత దాన్ని ప్రింట్ తీసి సర్జరీతో స్టెఫెన్‌కు తొలిరూపం వచ్చేలా చేసింది. టైటానియంతో తయారైన ఈ 3డి ప్రింటింగ్ మోడల్‌ను బెల్జియం నుంచి తెప్పించినట్లు డాక్టర్లు తెలిపారు.