
వాషింగ్టన్: పెంపుడు పిల్లులు, కుక్కలతో కాస్త సమయం వెచ్చిస్తే కాలేజీ విద్యార్థుల మానసిక స్థితి మెరుగవడంతోపాటు, వారిలో ఒత్తిడి స్థాయి తగ్గుతుందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. పెంపుడు జంతువులతో గడిపే పది నిమిషాల సమయం కూడా ఎంతో ప్రభావం చూపిస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాట్రిషియా పెండ్రీ తెలిపారు. పెంపుడు జంతువులతో సమయం గడిపిన విద్యార్థుల్లో ఒత్తిడిని కలిగించే కార్టిజాల్ అనే హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఇది ప్రయోగశాలల్లో కంటే నిజ జీవితంలో అనుసరిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయని తెలిపారు. ఈ మేరకు ప్రముఖ జర్నల్ ఏఈఆర్‌ఏ ఓపెన్‌లో వ్యాసం ప్రచురించారు.
‘పెట్ యువర్ స్ట్రెస్ అవే’పేరిట యూనివర్సిటీ పరిశోధకులు 249 మంది కాలేజీ విద్యార్థులతో పరిశోధనలు నిర్వహించారు. ఈ 249 మంది విద్యార్థులను 4 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ సభ్యులకు 10 నిమిషాలపాటు పిల్లులు, కుక్కలతో సమయం గడిపేలా చూశారు. రెండో గ్రూప్ సభ్యులు మొదటివారిని చూస్తూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. మూడో గ్రూప్ వాళ్లకు మొదటి గ్రూప్ సభ్యులు జంతువులతో సమయం గడుపుతున్న చిత్రమాలిక చూపించారు. నాలుగో గ్రూప్ సభ్యులను తమ వంతు వచ్చేవరకు వేచి ఉండమన్నారు.
వాళ్లను అంతసేపు ఫోన్ వాడడం కానీ, చదవడం కానీ చేయవద్దన్నారు. ఇలా పరిశోధనల్లో పాల్గొన్న సభ్యుల నుంచి లాలాజలం నమూనాలను ఉదయం నుంచి సేకరించారు. ఇందులో జంతువులతో నేరుగా గడిపిన విద్యార్థుల లాలాజలంలో కార్టిజాల్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు తమ పెంపుడు జంతువులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారని తెలుసని, కానీ దాని వల్ల ప్రయోజనం కూడా ఉంటుందని ఈ పరిశోధనల్లో తేలిందని పెండ్రీ తెలిపారు. దీంతో శారీరక ఒత్తిడిని కూడా జయించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment