వాషింగ్టన్: కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పలు దేశాలు ఇప్పటికే లాక్‌డౌన్ నిబంధనలు సడలించాయి. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సైతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలను సులభతరం చేసింది. సూపర్ మార్కెట్లు సహా అన్ని షాపులు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఇన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన ప్రజలు ప్రస్తుతం స్వేచ్చగా బయటకు వస్తున్నారు. కొన్ని చోట్ల సామాజిక ఎడబాటు, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు కూడా పాటించడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మరింత విస్త్రృతమయ్యే అవకాశం ఉందని వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్(ఐహెచ్‌ఎంఈ) హెచ్చరించింది. లాక్‌డౌన్ నిబంధనలు పూర్తిగా సడలించిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తి పెరిగి ఆగష్టు నాటికి దాదాపు లక్షా ముప్పై ఐదువేల మంది అమెరికన్లు మృత్యువాత పడతారని అంచనా వేసింది. (లక్ష మరణాలు.. చాలా భయంకరం: ట్రంప్)
‘‘అమెరికాలోని చాలా మటుకు రాష్ట్రాల్లో అంటువ్యాధి మరింతగా ప్రబలే అవకాశం ఉందని మేం భావిస్తున్నాం. కరోనా మరణాల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది’’అని ఐహెచ్‌ఎంఈ డైరెక్టర్ డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే అభిప్రాయపడ్డారు. సామాజిక ఎడబాటు నిబంధనలు మరింత కఠినతరం చేయాలని.. అదే విధంగా పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం.. వైరస్ లక్షణాలు ఉన్న వారు స్వచ్చందంగా ఐసోలేషన్‌కు వెళ్లేలా చేయడం ద్వారా రాబోయే ప్రమాదాన్ని కొంతమేర కట్టడి చేయవచ్చన్నారు. ఇక కోవిడ్ మరణాలపై ట్రంప్ అంతర్గత పాలనా విభాగం సైతం మే నెలాఖరు నాటికి రోజుకు 3 వేల మంది అమెరికన్ల చొప్పున మృత్యువాత పడతారని అంచనా వేయడం గమనార్హం. అదే విధంగా ప్రస్తుత కరోనా కేసుల నమోదు ఆధారంగా ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ మే 31 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు రెండు లక్షల మేర పెరుగుతుందని కథనం ప్రచురించింది.(వ్యాక్సిన్ పరిశోధనలపై చైనా సైబర్ దాడి: అమెరికా)
ఫొటో కర్టెసీ: రాయిటర్స్
ఈ విషయాల గురించి విలేకరులు శ్వేతసౌధ వర్గాలను ప్రశ్నించగా... ఇది వైట్‌హౌజ్ డాక్యుమెంట్ కాదని.. కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్‌కు ఈ సమాచారంతో ఎటువంటి సంబంధం లేదని వెల్లడించాయి. ఇక ఆది నుంచి కరోనా ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..కరోనా మరణాల విషయంలో పరిశోధనా సంస్థల అంచనాలు నిజమైన దాఖలాలు లేవని కొట్టిపడేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అమెరికాలో తొలుత కేవలం 60 నుంచి 75 వేల వరకు కోవిడ్ మరణాలు సంభవిస్తాయని అంచనా వేసిన ట్రంప్.. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ... ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే క్రమంలో మరిన్ని కరోనా మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని.. వైరస్‌తో లక్ష మంది దాకా మృత్యువాత పడతారని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే అమెరికాలో 68 వేల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 12 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment