ముస్లిం మహిళలకు కఠిన నిబంధనలు!
ముస్లిం మతాచారాలు కట్టుబాట్లలో ఇప్పటికే మహిళలకు ఎన్నో నిబంధనలు ఉన్నాయి. బ్రిటన్ లోని ఓ మసీదు తాజాగా మరిన్ని నిబంధనలు విధించింది. భర్త అనుమతి లేకుండా ముస్లిం మహిళలు ప్యాంట్లు వేసుకోకూడదని, సామాజిక మాధ్యమాలు వాడకూడదని, ఒంటరిగా ఇంటినుంచి బయటకు వెళ్ళకూడదంటూ కఠిన నిబంధనలు జారీ చేసింది. టైమ్స్ పరిశోధన నివేదికలో తాజాగా.. విస్మయపరిచే ఈ కొత్త విషయాలు వెల్లడయ్యాయి.
బ్రిటన్ లోని ముస్లిం సంఘాలు, మసీదులు ప్రచురించిన నిబంధనలను 'ద టైమ్స్' ఓ నివేదికలో ప్రస్తావించింది. లండన్ ఇస్లామిక్ సెంటర్, క్రోయ్ డాన్ మసీదు, సెంట్రల్ మసీద్ ఆఫ్ బ్లాక్ బర్న్ కొత్త నిబంధనలు జారీ చేసినట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం ఆ దేశంలో భర్త అనుమతి లేకుండా ఇంటినుంచి మహిళలు బయటకు రావడం ఎంతో ప్రమాదకరమని, అలాగే భర్త అనుమతి లేకుండా ఏ పనీ చేయొద్దని సూచించింది. ముఖ్యంగా మహిళలు ప్యాంట్లు ధరించకూడదని, ఫేస్ బుక్ వాడకూడదని, ఒక వేళ ఇప్పటికే అకౌంట్లు ఉన్నవారు వెంటనే డిలీట్ చేసేయాలని తెలిపింది. సెంట్రల్ మసీద్ ఆఫ్ బ్లాక్ బర్న్.. డేంజర్స్ ఆఫ్ ఫేస్ బుక్ తన వెబ్ పోస్టులో మద్యపానం పాపం అనే ఖురాన్ సూక్తిని ప్రస్తావిస్తూ, ఇది మహిళలు సామాజిక మాధ్యమాల వినియోగానికి వర్తింస్తుందని, దీని ద్వారా ముస్లిం మహిళలు బలవుతున్నారని వివరించింది. అంతేకాక ముస్లిం మహిళలు మోడలింగ్, యాక్టింగ్ చేయడంతో పాటు, గర్భస్రావం చేయించుకోవడం కూడ అనైతిక చర్య అని, అది మహాపాపం అంటూ మరో పోస్టులో ప్రస్తావించింది.
అయితే మసీదులు, ఇస్లామిక్ సంఘాలు వెబ్ సైట్లో జారీ చేసిన నిబంధనలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అనంతరం ముస్లిం మతపెద్ద, క్రాయ్డాన్ అండ్ ఇస్లామిక్ సెంటర్ ట్రస్టీ షుహైబ్ యూసఫ్ మాత్రం ఈ ఆంక్షలు తప్పని అంగీకరించారు. వెబ్ సైట్ లింక్ ను వెంటనే తొలగించామని, సాహిత్యాత్మక తప్పిదాలు జరిగినట్లు అభిప్రాయపడ్డారు. సైట్ లో రాసిన వివరాలను శుద్ధీకరించి, ప్రభావవంతమైన కథనాలను ప్రచురించాలని సూచించారు. అయితే ముస్లిం సంఘాల నిబంధనలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనలు ఆధునిక యుగంలోనూ వ్యక్తుల సంకుచిత ధోరణికి అద్దం పడుతున్నాయంటూ ఆరోపిస్తున్నాయి.