
ఎడారి పండ్లు!
చుట్టూ ఎక్కడ చూసినా ఇసుక... ఎర్రటి ఎండలేగానీ.. మచ్చుకు పచ్చటి ఆకు కూడా కనిపించదు. నిన్నమొన్నటి వరకూ దక్షిణ ఆస్ట్రేలియాలోని పోర్ట్ అగస్టా సమీపంలోని ఎడారి ఇలాగే ఉండేది. మరిప్పుడు? అక్కడో పచ్చటి ఒయాసిస్సు వెలసింది! సూర్యుడి శక్తిని ఒడిసిపట్టుకుని... సముద్రపు నీటిని వాడుకుని పంట సిరులు కురిపిస్తోంది!. ఫొటోలో కనిపిస్తోందే... అదే సన్‌డ్రాప్ ఫార్మ్స్ కంపెనీ ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ వ్యవసాయ క్షేత్రం!
మట్టి మాత్రమే కాదు.. ఈ హైటెక్ పొలంలో వ్యవసాయం చేసేందుకు పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల వాడకమూ లేదు. క్రిమి, కీటకనాశినులు, ప్రమాదకరమైన రసాయన ఎరువులకూ ఫుల్‌స్టాప్ పెట్టేశారు. విశాలంగా పరచుకున్న 23 వేల సోలార్ ప్యానెళ్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తే దాంతో పక్కనే ఉన్న సముద్రపు నీటిని మంచినీటిగా మార్చడం మాత్రమే. ఈ నీటితో పాటు గ్రీన్‌హౌస్‌లలోని కొబ్బరి పీచు, ఇతర సహజ పోషకాలతో పంటలు పండుతాయి.
మిత్రపురుగుల సాయంతోనే పంటలకు చేటు తెచ్చే క్రిమి కీటకాలను నాశనం చేయడం మరో విశేషం. ఇంతకీ ఈ ఇరవై హెక్టార్ల సోలార్ వ్యవసాయ క్షేత్రంలో ఏం పండుతాయో... దిగుబడి ఎంతో తెలుసా? ప్రస్తుతానికి ఇక్కడ టమోటాలను మాత్రమే పండిస్తున్నారు. ఏడాదికి 18 వేల టన్నులు.. ఇంకోలా చెప్పాలంటే రోజుకు 50 టన్నుల దిగుబడి వస్తోంది. త్వరలోనే తాము క్యాప్సికమ్, కీర వంటి పంటలూ పండిస్తామని, అమెరికా, యూరప్‌లలోనూ ఎడారి వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేస్తామని అంటోంది సన్‌డ్రాప్స్ ఫార్మ్స్!