
లాస్ ఏంజిలెస్: రసాయన కాలుష్యాన్ని పీల్చుకుని తనలోనే బంధించే ప్రొటీన్‌తో కూడిన తెరను తయారు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ప్రొటీన్ తన సహజ వాతావరణంలో ఉన్నట్లుగానే బయటి వాతావరణంలోనూ ఉండేలా స్థిరీకరించేందుకుగాను శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా కృషి చేస్తున్నారు.
అయితే ప్రొటీన్ తన సహజత్వాన్ని కోల్పోకుండా.. సింథెటిక్ పదార్థాలతో కలిపేలా వారు చేసిన పలు ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేదు. తాజా అధ్యయనంలో వారు చేసిన ప్రయోగం విజయవంతమైంది. సింథెటిక్ వాతావరణంలో ప్రొటీన్లు తమ సహజత్వాన్ని కోల్పోకుండా ఉంచే సరికొత్త మార్గాన్ని వారు కనిపెట్టారు.
తమ పరిశోధనలో ఉపయోగించిన పదార్థాలు జీవరసాయనిక చర్యలను ప్రారంభించాయని.. దీంతో సహజ పదార్థాలను సింథెటిక్ పదార్థాలతో కలిపే చర్యలను తాము విజయవంతంగా చేధించినట్టు భావిస్తున్నామని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టింగ్ షు వెల్లడించారు. ఈ తెరలను భారీ ఆకారంలో తయారు చేయడం ద్వారా యుద్ధ సమయాల్లో విష రసాయనాలను పీల్చుకునేందుకు ఉపయోగించవచ్చని తెలిపారు.