
చైనా యాంకర్లలో గుబులు
షాంఘై: చైనాలో టీవీ న్యూస్ యాంకర్లకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎందుకంటే ఓ రోబో హుషారుగా వార్తలు చదువుతూ వారి ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. షాంఘై డ్రాగన్ టీవీ యాజమాన్యం తమ కార్యక్రమాల ప్రసారానికి మామూలు యాంకర్లకు బదులుగా రోబో యాంకర్లను వినియోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 'సియావోఐస్' అనే రోబోతో వార్తలు చదివిస్తోంది. వాతావరణ విశేషాలతో ప్రసారమయ్యే బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో మంగళవారం నుంచి 'సియావోఐస్' తడుముకోకుండా వార్తలు చదువుతుండటంతో వీక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానీ, నిజానికి ఈ విషయంలో చైనా కంటే జపాన్ రెండడుగులు ముందే ఉంది. ఇంతకుముందే జపాన్ రోబో న్యూస్ రీడర్లను ప్రవేశపెట్టి, వాటితో పనిచేయించింది కూడా.
ఈ చైనా రోబోకు మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీని అందించింది. భాషతో పాటు సహజమైన భావోద్వేగాలను సైతం ఈ రోబో చక్కగా పలికిస్తోందట. దాని మధురమైన గొంతు సైతం వీక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. వార్తలు చదవటంలో రోబో విజయవంతంగా రంగప్రవేశం చేయటంతో అక్కడి ఉద్యోగులకు గుబులు మొదలైంది. అయితే సాధారణ యాంకర్ల స్థానాన్ని పూర్తిగా రోబోలతో భర్తీ చేయబోమని షాంఘై మీడియా గ్రూప్ చెబుతుండటంతో వారు కొంత ఊరట చెందుతున్నారు.