రోజూ ప్యాకెట్ సిగరెట్ల కన్నా అది డేంజర్..!
లండన్: మారుతున్న జీవనశైలి ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. బ్రిటన్‌లో ప్రతి 10 మందిలో ఒకరు ఈ నిద్రలేమి(ఇన్‌సోమ్నియా) మూలంగా నిద్రమాత్రల(స్లీపింగ్ పిల్స్)ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇది ఎంతమాత్రం సరైన విధానం కాదని, రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు కాల్చడం కన్నా నిద్రమాత్రలు ప్రమాదకరమని పరిశోధకులు తేల్చారు.
అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిద్రమాత్రలు కలగజేసే దుష్ఫలితాలపై నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. నిద్రమాత్రలతో క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుందని పరిశోధకుడు షాన్ యంగ్‌స్టెడ్ వెల్లడించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో ఇటీవల డైజిఫామ్ లాంటి నిద్రమాత్రల వాడకం కొంత తగ్గినప్పటికీ.. కొత్తగా వచ్చిన 'జెడ్-డ్రగ్స్' వాడకం పెరిగిందని వెల్లడించారు. అయితే.. ఇవి కూడా హార్ట్ ఎటాక్ అవకాశాన్ని 50 శాతం పెంచుతున్నాయని తెలిపారు. నిద్రమాత్రలను ఆశ్రయించడం కంటే వ్యాయామం చేయడం ద్వారా సహజనిద్ర లభిస్తుందని షాన్ వెల్లడించారు.