కారును ఢీకొన్న విమానం..
కాలిఫోర్నియా: ఓ ప్రైవేట్ విమానం అనుకోకుండా ప్రమాదానికి గురైంది. విమానం కారును ఢీకొన్న ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా పెట్రోలింగ్ అధికారి క్రిస్ పేరెంట్ తెలిపిన వివరాల ప్రకారం... ఒకే ఇంజిన్ విమానం లాంకేర్ 4 లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పైలట్ జాగ్రత్త వహించాడు. విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ల్యాండ్ అయ్యే సమయంలో రోడ్డుపై ఆగిఉన్న ఓ కారును విమానం ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ మహిళ(38) మృతిచెందింది. పైలట్ తో పాటు కారులో ఉన్న నలుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
పైలట్ మాత్రం ఈ విషయంలో తన తప్పేమీ లేదని, ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం ఓవైపు ఒరిగిపోవడం వల్ల కారును ఢీకొట్టిందని చెప్పాడు. విమానం కారును ఢీకొట్టే సమయంలో కారు డ్రైవర్ పాటలు వింటున్నాడని, శబ్ధాన్ని గ్రహించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి లాస్ వేగాస్ కు వెళ్లే దారిని కొన్ని గంటల పాటు మూసివేశారు. విమానం రోడ్డుపై ల్యాండ్ కావడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్చానికి లోనయ్యారు.