సౌదీలో కార్మికులకు ప్రభుత్వం సువర్ణావకాశం | soudi government give excusion for working labour | Sakshi
Sakshi News home page

సౌదీలో కార్మికులకు ప్రభుత్వం సువర్ణావకాశం

Published Sat, Aug 8 2015 6:19 PM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

soudi government give excusion for working labour

మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా): సౌది అరేబియాలో వీసా గడువు ముగిసి నిబంధనలకు విరుద్థంగా ఉంటున్న కార్మికులు ఎలాంటి శిక్ష అనుభవించకుండా ఇళ్లకు వెళ్లిపోయే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం మరోసారి కల్పించింది. రెండేళ్ల విరామం తరువాత మరోసారి సౌదిలో క్షమాభిక్షను అక్కడి ప్రభుత్వం అమలులోకి తీసుకవచ్చింది. విజిట్ వీసాలపై సౌది అరేబియాకు వెళ్లి వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటు పనులు చేస్తున్న తెలుగు కార్మికులు ఎందరో ఉన్నారు. కంపెనీ వీసాలపై వెళ్లి కంపెనీలో పని బాగాలేక బయటకు వచ్చిన కార్మికులు సౌదిలో వేలాది సంఖ్యలో ఉంటారు. నిబంధనలకు విరుద్దంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు సౌదిలో దాదాపు 30వేల మందికి పైగా ఉంటారని స్వచ్చంద సంస్థల అంచనాలు చెబుతున్నాయి. సౌదిలో నిబంధనలకు విరుద్దంగా ఉంటు పనులు చేస్తున్న కార్మికుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం గతంలో నతాఖా చట్టాన్ని అమలులోకి తీసుకవచ్చింది.

నతాఖా చట్టం ప్రకారం వర్క్ పర్మిట్ లేకుండా చట్టవిరుద్దంగా ఉంటున్న కార్మికులు రాయబార కార్యాలయం, సౌది పోలీసులకు స్వచ్చందంగా లొంగిపోయి ఇళ్లకు వెళ్లిపోవాలి. నతాఖా చట్టం అమలు అయిన మొదట్లో వేలాది మంది కార్మికులు ఇళ్లకు చేరుకున్నారు. సౌదిలో పని చేస్తున్న కార్మికుల్లో ఎక్కువ మందికి వర్క్ పర్మిట్‌లు లేక పోవడంతో పోలీసుల కంటపడకుండా అక్కడ తలదాచుకుంటున్నారు. ఈనెల 3 నుంచి క్షమాభిక్షను అమలు చేసిన సౌది ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఉన్న కార్మికులు స్వదేశాలకు వెళ్లిపోవడానికి వచ్చె నెల 30(సెప్టెంబర్ 30, 2015) వరకు గడువు విధించింది. ఈ సారి మాత్రం నిబంధనలకు విరుద్దంగా ఉన్న కార్మికులు స్వదేశాలకు వెళ్లిపోకుంటే మాత్రం కఠిన శిక్షలను అమలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

క్షమాభిక్ష సమయంలో ఇళ్లకు వెళ్లిపోకుండా ఉండి గడువు ముగిసిన తరువాత పట్టుబడితే కఠిన జైలు శిక్ష అమలుతో పాటు పాస్‌పోర్టును రద్దు చేసి మరే గల్ఫ్ దేశానికి వెళ్లకుండా చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. విదేశాంగ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లో తాత్కలిక పాస్‌పోర్టును జారీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. సౌది ప్రభుత్వం అమలు చేస్తున్న క్షమాభిక్ష వల్ల తెలంగాణ జిల్లాలకు చెందిన వేలాది మంది కార్మికులకు సొంత గ్రామాలకు చేరుకునే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే శిక్షల నుంచి తప్పించుకోవాలని గల్ఫ్ బాధితుల సంఘాలు కార్మికులకు సూచిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement