రాకెట్ల చరిత్ర తిరగరాతకు..!
రాకెట్ అంతరిక్ష ప్రయోగం కొత్త పుంతలు తొక్కనుందా?.. అవును! స్పేస్ ఎక్స్ తాజాగా చేసిన ప్రయోగం దీన్నే సూచిస్తోంది. రాకెట్ వేగంగా దూసుకుపోవడానికి ఉపయోగపడే బూస్టర్లను తిరిగి ఉపయోగించుకునే విధంగా చేసిన ప్రయోగం విజయవంతమైంది. శనివారం స్పేస్ ఎక్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన ఫాల్కన్ రాకెట్ విజయవంతమైంది. ఇందుకు ఉపయోగించిన బూస్టర్ తిరిగి విజయవంతంగా సముద్రంలో ఉన్న స్టేషన్ మీద ల్యాండ్ అయింది.
ఇందుకోసం ప్రత్యేకమైన టెక్నాలజీని రాకెట్లో ఉపయోగించింది స్పేస్ ఎక్స్. ప్రధాన భాగాన్ని విడుదల చేసిన అనంతరం రాకెట్ నుంచి విడిపోయిన బూస్టర్ 50 మైళ్ల వేగం నుంచి ఇంజన్ల సాయంతో సముద్రంలో ఉంచిన స్టేషన్ మీద ఆగింది.
గత ఏడాది డిసెంబర్లో కేప్ కానవేరల్లో బూస్టర్ను విజయవంతంగా నిలిపినా సాంకేతికలోపంతో పేలిపోయిన సంగతి తెలిసిందే. ప్రయోగ విజయానంతరం స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ మాట్లాడుతూ విమానాల్లా తిరిగి ఉపయోగించగల రాకెట్ల తయారీయే కంపెనీ లక్ష్యమని తెలిపారు. ముందు ముందు ఇలాంటి విజయాలు ప్రజలకు సాధారణమైపోతాయని అన్నారు. గత కొద్ది నెలల కిందట జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ను పశ్చిమ టెక్సాస్లో విజయవంతంగా ప్రయోగించినా అది ఫాల్కన్ అంత వేగంగా గమ్యాన్ని చేరుకోలేకపోయింది. స్పేస్ ఎక్స్ విజయంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.