సెల్ఫీ కోసం సిల్లీగా ఇరుక్కుపోయింది
టర్కీ: ట్రెండు మొదలై రెండేళ్లు దాటింది. దుర్ఘటనలు వందలకు పైగా ఉన్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట పతాక శీర్శికల్లో వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా సరే.. ఎవరి తీరు వారిదే.. కుక్క తోక వంకరే అన్న చందాన.. సెల్ఫీల విషయంలో మాత్రం యువత ఏ మాత్రం మారడం లేదు. చేతిలో ఫోన్ పట్టారా.. అందులో ఫ్రంట్ కెమెరా ఉందా అంతే సంగతులు.
వెంటనే ఓ సెల్ఫీ అది కూడా చక్కగా మైదాన ప్రాంతాల్లోనే, తల్లిదండ్రులతోనో అంటేనా అదీ కాదు.. చావు కొనితెచ్చుకునే చోట.. కాళ్లు విరగ్గొట్టుకునే ప్రాంతాల్లో.. వరుసపెట్టి సెల్ఫీ చివరకు ప్రమాదాలు కొనితెచ్చుకోవడాలు. తాజాగా టర్కీలోని అటకం జిల్లాలో సెవిలే కే అనే పేరుగల ఓ యువతి సెల్ఫీతో చిక్కులో పడింది. అప్పటికే నీళ్లు ఆగి ఉండి పాకుడు పట్టిన పెద్ద రాళ్లు ఉన్న చోటకు వెళ్లి వాటిపై నిలబడి సెల్ఫీ దిగింది. ఈ క్రమంలో ఆమె ఫోన్ తో సహా కాలు జారీ రెండు బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో తలలు పట్టుకున్న పోలీసులు దాదాపు రెండుగంటలపాటు శ్రమించి డ్రిల్లింగ్ మిషన్ తెచ్చి ఆ బండలు పగలగొట్టి చివరకు బయటకు తీశారు.