కేన్సర్ వ్యాధి దురదృష్టమేనట..!
వాషింగ్టన్: కేన్సర్ రావడానికి దురదృష్టమే కారణమట. అమెరికాకు చెందిన జాన్ హాప్కిన్స్ కిమ్మెల్ కేన్సర్ సెంటర్ పరిశోధకులు ఈ విషయం చెబుతున్నారు! చాలా రకాల కణజాలాల్లో కేన్సర్ రావడానికి, వృద్ధికి కారణాలపై వారు పరిశోధన చేశారు. పెద్దల్లో కేన్సర్ రావడానికి మూడింట రెండు వంతుల కారణం ‘దురదృష్ట’మేనని, మిగతా ఒక వంతు మాత్రమే వాతావరణ, అనువంశిక కారణాలని తేల్చారు!
కణాల్లోని జన్యువులు ఉత్పరివర్తనం చెంది కేన్సర్‌కు దారితీసే పరిస్థితులపై మోడల్‌ను రూపొందించినట్లు చెప్పారు. కణ విభజన జరిగే క్రమంలో జన్యువుల్లో ఒక్కసారిగా ఉత్పరివర్తనాలు చోటుచేసుకునే అవకాశముందని.. అది కేన్సర్‌కు కారణమవుతుందని తెలిపారు. అయితే ఇలాంటి ఉత్పరివర్తనాలకు పొగాకు, ఆల్కాహాల్ వంటి పదార్థాలు కారణమవుతాయన్నారు. కానీ ఇలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగించినా కొందరు కేన్సర్ బారిన పడకుండా ఉంటారని అన్నారు.