సుష్మాకు సూపర్‌ ఉమన్‌ ట్వీట్ల వర్షం | super woman lilly singh tweets to sushma swaraj on visa issue | Sakshi
Sakshi News home page

సుష్మాకు సూపర్‌ ఉమన్‌ ట్వీట్ల వర్షం

Published Sat, Apr 8 2017 1:02 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

సుష్మాకు సూపర్‌ ఉమన్‌ ట్వీట్ల వర్షం - Sakshi

సుష్మాకు సూపర్‌ ఉమన్‌ ట్వీట్ల వర్షం

భారతదేశం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇక్కడకు రావాలని చాలా ప్రయత్నించింది. కానీ టొరంటోలోని భారత రాయబార కార్యాలయం నుంచి వీసా పొందాలంటే ఆమెకు చుక్కలు కనిపించాయి. సాధారణంగా యూట్యూబ్‌లో తనదైన శైలిలో వీడియోలు పెడుతూ అందరినీ తెగ నవ్వించే లిల్లీ సింగ్‌.. అలియాస్‌ సూపర్‌ ఉమన్‌ ఈసారి ట్విట్టర్‌ ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదించింది. తన కష్టాలు తీర్చమని, టొరంటో ఎంబసీ విషయం చూడాలని కోరింది. మధ్యలోప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా తన ట్వీట్లలో ట్యాగ్‌ చేసింది. టొరంటోలోని రాయబార కార్యాలయంలో వీసా పొందడం చాలా కష్టంగా ఉందని, అసలు ఏమాత్రం ప్రొఫెషనల్‌గా లేదని తెలిపింది.

తాను వీసా పొందడానికి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లానో, ఎన్ని కష్టాలు పడ్డానో చూడండంటూ ఒక వీడియో కూడా పోస్ట్‌ చేసింది. అక్కడి ఉద్యోగులు చాలా తలబిరుసుగా ఉన్నారని, కేవలం ఒక్క ప్రశ్న అడిగినందుకు తన మీద పలు సందర్భాల్లో మండిపడ్డారని తెలిపింది. ఆ తర్వాత ఆమెకు వీసా అయితే వచ్చింది. కానీ తాను ఒక ఏడాది పాటు వీసా కావాలని దరఖాస్తు చేస్తే.. కేవలం మూడు నెలలకు మాత్రమే ఇచ్చారని వాపోయింది. అక్కడున్న వారిలో ఒక్క ఉద్యోగి మాత్రం చాలా స్నేహ పూర్వకంగా ఉన్నారని, తాను ఇంటర్‌నెట్‌ సెలబ్రిటీ అని తెలిసిన తర్వాత తనతో కలిసి ఒక ఫొటో కూడా తీసుకున్నారని లిల్లీసింగ్‌ చెప్పింది. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ ఆమెకు సమాధానం అయితే ఇవ్వలేదు గానీ, మొత్తానికి మూడు నెలలకైనా వీసా మాత్రం ఆమె చేతికి వచ్చేసింది కాబట్టి ఎంచక్కా భారతదేశం రావచ్చు. ఇక్కడ అవకాశం ఉంటే అపాయింట్‌మెంట్‌ తీసుకుని సుష్మా స్వరాజ్‌ను కూడా కలవచ్చు. తాను తొలిసారిగా రాసిన ‘హౌ టు బీ ఎ బాస్‌: ఎ గైడ్‌ టు కాన్కరింగ్‌ లైఫ్‌’ అనే పుస్తకం ప్రమోషన్‌ కోసం ఆమె ఈ నెలాఖరులో భారతదేశానికి రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement