
ఉత్తి చావు.. వీరికి అదో తుత్తి..
ఖననం జరగాల్సింది చనిపోయినవారికి.. ఇక్కడ జరుగుతున్నది మాత్రం బతికున్న మనిషికి! అవును, ఇవి ఉత్తుత్తి అంత్యక్రియలు. క్యూబాలోని శాంటియాగో డి లాస్ వెగాస్ గ్రామ ప్రజలకు ఇదో తుత్తి. అక్కడ ఉత్సవ సీజన్‌కు ముగింపుగా.. పునర్జన్మకు సూచికగా.. ఫిబ్రవరి 5న ఈ విచిత్రమైన అంత్యక్రియల కార్యక్రమాన్ని జరుపుతారు. మొత్తం తతంగాన్ని సంప్రదాయబద్ధంగా జరిపిస్తారు. వీధుల్లో ఊరేగింపు.. ‘చనిపోయిన’ వారి భార్య పాత్రధారి పడిపడి ఏడవడం.. నన్నూ ఆయనతో తీసుకుపో దేవుడా.. అంటూ శోకాలు పెట్టడం.. స్థానికులంతా మృతుడి గొప్పతనం గురించి చర్చించుకోవడం.. ఇలా ఎక్కడా తేడా లేకుండా సీన్‌ను రక్తికట్టిస్తారు. చివరగా.. ఖననం కోసం శవపేటికను భూమిలో తీసిన గుంతలోకి దించిన తర్వాత.. గ్రామస్తులు ‘మృతుడి’ గొంతులో కొంత రమ్ పోయగానే.. అతడు ఎంచక్కా లేచి వచ్చేస్తాడు.. దాంతో ఆల్ హ్యాపీస్.