దేశం కోసం గ్రీన్ కార్డును రద్దు చేసుకున్నాడు..
మంచి చదువు, ఉద్యోగాల కోసం ఫారెన్ కంట్రీస్ కు వెళ్ళి.. అక్కడే గ్రీన్ కార్డును సంపాదించి స్థిరపడిపోయిన వాళ్ళ గురించి విన్నాం... కొన్నాళ్ళ తర్వాత సంపాదించిన దానికి సంతృప్తితో స్వదేశానికి తిరిగి వచ్చి.. దేశంలోని పేదలకు, అనాధలకు చేయూతనందించేవారినీ చూస్తుంటాం.... ఏకంగా మాతృభూమి కోసం తన స్టేటస్ ను, పౌరసత్వాన్ని వదులుకొని ఇండియాకు వచ్చేశాడో ఎన్నారై. తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. మళ్ళీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు కావలసిన విద్యను కూడా అభ్యసించి... మానవత్వాన్ని చాటుతూ భారతదేశాన్ని విపత్తు స్థితి స్థాపకంగా చేయడమే ధ్యేయంగా తనవంతు సాయం అందించేందుకు నడుం బిగించాడు.
అమెరికాలోని ఇంటర్నేషనల్ హోటల్ చైన్ జనరల్ మేనేజర్ గా పూర్తిస్థాయి వృత్తిని, పౌరసత్వాన్ని వదిలి ఇండియాకు వచ్చేసిన హరి బాలాజీ.. సెప్టెంబర్ 11, 2001 న్యూయార్క్ ఉదంతం సమయంలో జూరిచ్ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోకి రెండు జెట్ లైనర్స్ దూసుకెళ్ళిన ఘటనలో దాదాపు మూడు వేలమంది మృతి చెందగా... ఆమెరికా నడిబొడ్డున టెర్రరిస్టుల దాడితో అల్లకల్లోలం అలుముకుంది. అదేరోజు జురిచ్ నుంచి అట్లాంటా బయల్దేరిన హరి ప్రయాణిస్తున్నవిమానం ఉన్నట్టుండి దారి మళ్ళించారు.
ప్రయాణీకులెవరికీ ఏం జరిగిందో తెలియలేదు. చివరికి జురిచ్ లోని హోటల్ రూమ్ కు చేరిన హరికి... వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ గురించి తెలిసింది. మానవ నిర్మిత విపత్తుపై స్వానుభవమైంది. ఆతర్వాత న్యూయార్క్ మేయర్ గిలియానీ గెట్ మోటివేటెడ్ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు హరిని ప్రేరేపించాయి. దీంతో విపత్తు సంసిద్ధత గురించి వాస్తవాలను అధ్యయనం చేసేందుకు హరి ఆకర్షితుడయ్యారు.
ఇండియాలోని చెన్నైకి చెందిన హరి బాలాజీ... స్విజ్జర్లాండ్ లోని స్విస్ హోటల్ మేనేజ్ మెంట్ లో చదివి, భారత్, స్విజ్జర్లాండ్, కువైట్ సంయుక్త ప్రముఖ బ్రాండ్లకు అనేక నిర్వహణ హోదాల్లో పనిచేశాడు. లూసియానాలో ఉన్నప్పుడు సహజ విపత్తు అయిన హరికేన్ ను కళ్ళారా చూసి, తీవ్రంగా స్పందించాడు. ఇలా సునామీ వంటి పలు ప్రకృతి బీభత్సాలను చూసిన హరి... డిజాస్టర్ మేనేజ్ మెంట్ పై స్వంత దేశంలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యుల మద్దతుతో గ్రీన్ కార్డ్ రద్దు చేసుకున్నాడు. భారతదేశానికి పూర్తిగా తరలివచ్చాడు.
తిరిగి వచ్చిన తర్వాత హరి ఆరోగ్య సంప్రదాయ విద్యను చెన్నై శ్రీ రామచంద్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. హాస్పిటల్ అండ్ హెల్త్ సిస్టమ్స్ మేనేజ్ మెంట్ లో ఎంబిఎ చేశాడు. కోర్సులో భాగంగా చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో విపత్తుల అంచనాపై అధ్యయనం చేశాడు. చెన్నై ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లో ఓ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడుగా పనిచేశాడు. పలు ప్రత్యేక ప్రాజెక్టులను నిర్వహిస్తూ విపత్తు నిర్వహణలో స్వతంత్ర కార్ఖానాలు నిర్వహించడం ప్రారంభించాడు. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు సమయాల్లో వ్యూహాలపై తాను నిర్వహిస్తున్న కార్ఖానాల్లో దృష్టి పెట్టారు. భౌతిక నష్టాన్నే కాక, మానసికంగా కూడ వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కావలసిన శిక్షణ ఇవ్వడంపై అవగాహన కల్పించాడు.
ఒక్క విపత్తులపైనే కాక హరి బాలాజీ... మానవత్వాన్ని చాటుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణాకు గురౌతున్న మహిళలు, బాలికలకు అవగాహన కల్పించడం, వివక్షను నిర్మూలించే ప్రయత్నాలతో పాటు... విపత్తు సమాయాల్లో ఎదుర్కొనే పలు సమస్యలపై దృష్టి సారిస్తూ... అడుగు ముందుకేస్తున్నాడు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు విపత్తులపై అవగాహన కల్పించేందుకు ఇన్సెంటివిటి తరగతులను కూడ నిర్వహిస్తున్నారు. విపత్తు నిర్వహణలో ప్రపంచంలోనే భారత్ ముందుండేందుకు కృషి చేస్తూ... ప్రత్యేక కార్యక్రమాలతో ఉత్సాహంగా దూసుకుపోతున్నాడు.