ఒక్క డిబేట్కు 67 కోట్లు కోరిన ట్రంప్!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాంచి బిజినెస్ మెన్ అనిపించుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ పోటీలో నిలిచేందుకు సరిపడా డెలిగేట్ల మద్దతు లభించిన సందర్భంగా నార్త్ డకోటాలోని బిస్మార్క్లో విలేకరుల సమావేశంలో ట్రంప్ చెప్పిన మాటలు విన్నవారు.. ఎక్కడ డబ్బు రాబట్టగలమో బహుశా ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు అనుకుంటున్నారు.
డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం కోసం హిల్లరీ క్లింటన్తో పోటీ పడుతున్న బెర్నీ సాండర్స్తో డిబేట్లో పాల్గొంటారా అని ట్రంప్ను పాత్రికేయులు అడగ్గా.. పాల్గొంటాను గానీ నాకు 10 మిలియన్ డాలర్లు ఇస్తారా అని ఆయన ప్రశ్నించడంతో వారు బిత్తరపోయారు. డిబేట్ నిర్వహించే మీడియా సంస్థ ఇచ్చే ఆ డబ్బుతో చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తానని ట్రంప్ వెల్లడించారు.
మీడియా సంస్థల బిజినెస్ గురించి తనకు బాగా తెలుసునని చెప్పిన ట్రంప్.. సాండర్స్తో డిబేట్కు మంచి రేటింగ్ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సాండర్స్ తనకు లవబుల్ పర్సన్ అని, ఆయనతో డిబేట్ తనకు ఇష్టమన్నారు. మరోవైపు సాండర్స్ కూడా ఈ డిబేట్కు ఓకే అంటూ సంకేతాలిచ్చారు. చూడాలి మరి ట్రంప్ చారిటీ బిజినెస్ డీల్కు ఏ మీడియా సంస్థ ముందుకొస్తుందో.