సాక్షి, న్యూఢిల్లీ: ట్విటర్ చైర్మన్ గా గూగుల్ మాజీ సీఎఫ్‌ఓ పాట్రిక్ పిచెట్ నియమితులయ్యారు. ప్యాట్రిక్ పిచెట్‌ను బోర్డు ఛైర్మన్‌గా నియమించినట్లు ట్విటర్ నిన్న ( జూన్ 2, మంగళవారం) ప్రకటించింది. ప్రస్తుత డైరెక్టర్ ఓమిడ్ కోర్డెస్టా స్థానంలో తాజా నియామకం జరిగినట్టు తెలిపింది. ఓమిడ్ స్వతంత్ర డైరెక్టరుగా కొనసాగుతారని ట్విటర్ వెల్లడించింది.
ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాక్ డోర్సీని కొనసాగించడానికి అనుమతించే ఒప్పందంలో భాగంగానే ఈ నియామకమని భావిస్తున్నారు. ట్విటర్ అతిపెద్ద పెట్టుబడిదారు ఇలియట్ మేనేజ్‌మెంట్ సంస్థ డోర్సీని తొలగించేందుకు యత్నించిన మూడు నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఛైర్మన్‌గా, పిచెట్ సంస్థ నిర్వహణ స్థిరత్వానికి, ఆర్థిక సాధికారితపై దృష్టి కేంద్రీకరించనున్నారని అంచనా.
మరోవైపు తన నియామకంపై స్పందించిన పిచెట్ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దే క్రమంలో తన నియామకమనీ, ట్విటర్ మంచి పాలన పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ వివాదంలో ట్విటర్ వైఖరిని పిచెట్ బహిరంగంగా సమర్థించారు. 2008-15 వరకు గూగుల్ సీఎఫ్ఓగా పనిచేసిన పిచెట్, కెనడియన్ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఇనోవియా క్యాపిటల్‌లో సాధారణ భాగస్వామిగా ఉన్నారు. 2015 వరకు ట్విటర్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న ఓమిడ్ కూడా గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment