మెంటలెక్కినట్లు మహిళా పైలట్.. ప్రయాణికులు షేక్
వెల్లింగ్టన్: ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా ఆ మాటల మధ్య పొందిక లేకుండా ఉండటం, మానసిక పరిస్థితి ఆందోళనకరంగా కనిపించిన నేపథ్యంలో అమెరికాలో ఓ మహిళా పైలట్‌ను టేకాఫ్‌కు ముందు దింపేశారు. అయితే, ఆమె ఎవరనే వివరాలు చెప్పేందుకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నిరాకరించింది. ప్రయాణీకులంతా భయపడేలా ఆమె ప్రవర్తించిందని, దీంతో విమానం నుంచి కొంతమంది ప్రయాణికులు దిగిపోయారని కూడా ఎయిర్‌లైన్స్ తెలిపింది. యూఎస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 455 ఆస్టిన్ నుంచి టెక్సాస్ మీదుగా శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సి ఉంది. ఓ పురుషుడు, ఓ మహిళ దీనికి పైలట్లుగా ఉన్నారు.
ఇందులో మహిళా పైలట్ తన విధుల నిమిత్తం వేసుకునే దుస్తులు కాకుండా.. సాధారణ పౌరులాలుగా వచ్చింది. అంతేకాకుండా డోనాల్డ్ ట్రంప్‌కు గానీ, హిల్లరీ క్లింటన్‌కుగానీ తాను ఓటు వేయలేదని, వారిద్దరు అబద్ధాల కోరులని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు తాను విడాకులు తీసుకుంటున్నానంటూ చెప్పింది. ఆ తర్వాత ఇంకేవో మాటలతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయేలా చేసింది. దీంతో కొంతమంది ప్రయాణీకులు దిగిపోతుండటంతోపాటు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ పైలెట్‌ను దింపేశారు. 90 నిమిషాలు ఆలస్యంగా కొత్త పైలెట్ ను పంపించారు.