విమానం గాల్లో ఉండగా పేలిన ఇంజిన్..!
విమానం గాల్లో ఉండగా పేలిన ఇంజిన్..!
Published Sun, Aug 28 2016 9:21 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
వాషింగ్టన్: విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిలైన ఘటన శనివారం అమెరికాలో చోటుచేసుకుంది. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం న్యూ ఓర్లిన్స్ నుంచి ఒర్లాండోకు వెళ్తుండగా విమానం ఇంజన్లలో ఒకటి ఆకస్మికంగా విఫలమైంది. పెద్దశబ్దంతో ఇంజిన్లో పేలుడు సంభవించడంతో విమానం ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో అందులోని 99 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. విమానాన్ని అత్యవసరంగా పెన్సాకోలా విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
విమానంలో తన భర్తతో పాటు ముగ్గురు పిల్లలతో ప్రయాణించిన ఓ మహిళ మీడియాతో మాట్లాడుతూ.. తన విండో సీటు వెలుపల ఉన్న విమాన ఇంజిన్ ఒక్కసారిగా పేలిందని, అక్కడ నుంచి పొగ రావడం గమనించానని తెలిపింది. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైనట్లు వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ జరుపుతున్నట్లు సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో విమానాలు నడిపే అతిపెద్ద విమాన సంస్థగా సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్కు పేరుంది.
Advertisement
Advertisement