అమెరికాలో యువ ఇంజినీర్ మృతి
- ఎస్.చిక్కాలలో విషాదఛాయలు
- మృతదేహం కోసం ఎదురుచూపులు
పాలకొల్లు అర్బన్ : పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాలకు చెందిన యువ ఇంజినీర్ నిమ్మల జయశేషరాఘవేంద్ర (25) అమెరికాలో గత ఆదివారం మృతిచెందారు. దీంతో శివదేవుని చిక్కాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. మిత్రులు, బంధువులు రాఘవేంద్రతో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుపెట్టారు.
రాఘవేంద్ర భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం అమెరికాలోని ఒక్లహామా పట్టణంలో గల ఒక సరస్సులో బెలూన్ ట్రెక్కింగ్‌పై ఈతకొడుతూ ప్రమాదవశాత్తు సరస్సులో పడి మృతిచెందారు. రాఘవేంద్ర చిత్తూరులో ఇంజినీరింగ్, అమెరికాలో ఎంఎస్ చదివారు. అక్కడే ఐటీ కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఇతని తండ్రి నిమ్మల అనంత వెంకట్రామారావు ఎక్సైజ్ శాఖలో ఉన్నతోద్యోగి. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు వద్ద పీఎస్‌గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి కాగా, చెల్లెలు భవాని ఇంటర్మీడియెట్ చదువుతోంది.
మృతదేహం తరలింపునకు ఏర్పాట్లు
రాఘవేంద్ర అమ్మమ్మ, నాయనమ్మ శివదేవునిచిక్కాలలోనే ఉంటున్నారు. అతని తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. రాఘవేంద్ర మృతదేహాన్ని స్వస్థలమైన శివదేవునిచిక్కాలకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదే హం శనివారం రాత్రికి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకుం టుందని, అక్కడ నుంచి కారులో శివదేవునిచిక్కాలకు ఆదివారం ఉదయం తీసుకువస్తామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇది రెండో ఘటన
శివదేవునిచిక్కాలకు చెందిన యువకులు అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన వారిలో రాఘవేంద్ర రెండో వ్యక్తి. మూడేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆకుల సత్యేంద్రనాథ్ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.