నా దగ్గర డబ్బు లేదు.. అందుకే: కమలా హ్యారిస్‌ | US Presidential Race 2020 Democrat Kamala Harris Ends Her Campaign | Sakshi
Sakshi News home page

అనూహ్యం: కమలా హ్యారిస్‌ అవుట్‌!

Published Wed, Dec 4 2019 8:29 AM | Last Updated on Wed, Dec 4 2019 11:10 AM

US Presidential Race 2020 Democrat Kamala Harris Ends Her Campaign - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల పోటీ నుంచి డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌‌(54) నిష్క్రమించారు. ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఈ కాలిఫోర్నియా సెనెటర్‌ మంగళవారం ప్రకటన చేశారు. ఈ మేరకు...‘నేను బిలియనీర్‌ను కాదు. నా ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లలేను. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు నా వద్ద సరిపడా ఆదాయ వనరులు లేవు. ఇందుకోసం అన్ని మార్గాలు నేను అన్వేషించాను. అయితే కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల నా జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’అంటూ తన మద్దతుదారులు, విలేకర్లకు ఇ-మెయిల్‌ పంపించారు. కాగా ఈ ఏడాది జనవరిలో కమలా హ్యారిస్‌ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. మనమంతా కలిసే ఇది పూర్తి చేద్దాం. నాతో కలిసి రండి’ అని ఆమె తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. 

ఫర్‌ ద పీపుల్‌..
కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో గల బాల్టిమోర్‌ నుంచి కమలా హ్యారిస్‌.. ‘ఫర్‌ ద పీపుల్‌’  అనే నినాదంతో  తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్ను, ఇమ్మిగ్రేషన్‌ పాలసీ, హెల్త్‌కేర్‌ సిస్టమ్‌, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ఆమె తన ప్రచారంలో ప్రస్తావించారు. అయితే హెల్త్‌కేర్‌ వంటి పథకాలను ఎలా ముందుకు తీసుకువెళ్తామన్న విషయాలపై స్పష్టతనివ్వకపోవడంతో కమల ప్రచార పర్వంలో వెనుకబడ్డారు. ఈ క్రమంలో పార్టీలోని ఇతర సభ్యులతో పోలిస్తే ఆమె 3.5 శాతం ఓట్లు మాత్రమే సంపాదించి ఆరో స్థానానికి పడిపోయారు. దీంతో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ఆమె వైదొలిగారు. ఇక ఈ విషయంపై స్పందించిన కమల సహ సభ్యులు, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నల్లజాతి అభ్యర్థి కోరీ బూకర్‌...‘ తన ప్రచారం హద్దులన్నింటినీ చెరిపివేసింది. ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. లవ్‌ యూ సిస్టర్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. మరోవైపు కమల నిర్ణయంపై ఆమె మద్దతుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కమల కంటే ముందు మెంటానా గవర్నర్‌ స్టీవ్‌ బుల్లోక్‌, మాజీ కాంగ్రెస్‌ సభ్యులు జో సెస్టాక్‌ అధ్యక్ష బరి నుంచి తప్పుకొన్నారు. (చదవండి :నేను పోటీ చేస్తున్నా.. నాతో కలిసి రండి’)

ఫిమేల్‌ ఒబామా....
1964 అక్టోబర్‌ 20న కాలిఫోర్నియాలో కమలా దేవి హ్యారిస్‌ జన్మించారు. ఆమె తల్లి తమిళనాడులోని చెన్నైకి చెందినవారు కాగా.. తండ్రి ఆఫ్రికన్‌. ఈ క్రమంలో ఆఫ్రికా, ఆసియా సంస్కృతుల మిశ్రమ సంస్కృతి కారణంగా ఆమెను రాజకీయంగా బరాక్‌ ఒబామాతోనూ పోల్చేవారు. 1986లో హోవార్డ్‌ యూనివర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ పూర్తిచేశాక, హేస్టింగ్‌ కాలేజీ ఆఫ్‌ లా నుంచి కమల న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2003లో శాన్‌ఫ్రాన్సిస్‌కో డిస్ట్రిక్‌ అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. 2011-17 మధ్య కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2014లో డగ్లస్‌ ఎమ్‌హోఫ్‌ను పెళ్లిచేసుకున్నారు.  2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలకబాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అవలంబిస్తున్న విధానాల పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ప్రచార కార్యక్రమాల్లో ఆయన శైలిని ఎండగట్టారు. అయితే అనూహ్యంగా అధ్యక్ష రేసు నుంచి తప్పుకొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement