
త్రీడేస్ వాట్సాప్ క్లోజ్!
బ్రెజిల్: బ్రెజిల్లో వాట్సాప్పై వేటు పడింది. వాట్సాప్ ను మూడు రోజులపాటు నిషేధించాలంటూ అక్కడి కోర్టు ఆదేశించడంతో గత 72గంటలుగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఈ నిర్ణయంతో దాదాపు 100 మిలియన్లమంది వాట్సాప్ యూజర్లపై ఈ ప్రభావం పడింది. అసలు ఎందుకు దీనిపై నిషేధం విధించాల్సి వచ్చిందనే కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ముఠా నేరాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు వాట్సాప్ సంస్థ అంగీకరించని కారణంగానే పరోక్షంగా దానిపై పోలీసులు నిషేధం విధించాల్సిందిగా కోర్టును కోరినట్లు తెలుస్తోంది.
బ్రెజిల్ లో పలు నేరాలు చేసే దొంగలు, క్రిమినల్స్ అంతా కూడా ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలనే ఉపయోగించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో వారి నేరాలను విచారించే పోలీసులకు సమాచారం అవసరం ఉన్నందున చాలాసార్లు ఆ కంపెనీలను కోరిన సహకరించలేదని తెలుస్తోంది. అందుకే బ్యాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సామాజిక అనుసంధాన వేదికల్లో వేగంగా దూసుకొచ్చిన ప్రసార మాధ్యమం వాట్సాప్. ఫోన్ చేసేందుకు కాల్ బ్యాలెన్స్ లేకుండా ఉంటున్నారేమోగానీ.. వాట్సాప్ యూజ్ కోసం డేటా లేకుండా మాత్రం ఎవరూ ఉండలేని పరిస్థితి. ఇప్పటికి దీనివల్ల ఎన్నో సమస్యలు వచ్చినా ఓ రకంగా కమ్యూనికేషన్కు మాత్రం ఇది ఒకింత వేగంగా పనిచేస్తుందనే చెప్పాలి. ఇలాంటి వాట్సాప్ ఈ మధ్యకాలంలో పలు విమర్శలకు గురవుతుంది కూడా.