ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు!
న్యూ ఢిల్లీ: ఇంతకు ముందు మార్కెట్లో మాంచి క్రేజ్ ఉన్న ఫోన్లు కొన్ని ఇప్పుడు పరిమిత సంఖ్యలో వాడుకలో ఉన్నాయి. ఇటీవల ఫేస్బుక్ ఆధీనంలోకి వెళ్లిపోయిన వాట్సప్.. ఇలాంటి కొన్ని మొబైల్లలో ఈ సంవత్సరాంతానికి తమ సేవలను నిలిపేయాలని భావిస్తోంది. ఈ జాబితాలో ఒకప్పటి పాపులర్ మొబైల్లు ఉన్నాయి.
అన్ని బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టం వర్షన్ మొబైల్లకు( బ్లాక్ బెర్రీ 10తో సహా), నోకియాకు చెందిన సింబియాన్ యస్40, సింబియాన్ యస్60 వెర్షన్లకు సేవలను నిలిపేయాలని వాట్సప్ సంస్థ నిర్ణయం తీసుకుంది. 2009లో వాట్సప్ను ప్రారంభించినప్పుడు ఇప్పుడున్న మొబైల్ మార్కెట్కు భిన్నమైన పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. మార్కెట్లోని 70 శాతం ఫోన్లకు బ్లాక్ బెర్రీ, నోకియా సంస్థలే ఆపరేటింగ్ సిస్టంను సమకూర్చేవి. ఇప్పుడు మాత్రం యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఆపరేటింగ్ సిస్టంలు అందిస్తున్న మొబైల్లు 99 శాతం మార్కెట్ను ఆక్రమించాయి. ఈ నేపథ్యంలో ఎక్కువమంది వినియోగదారులు ఉపయోగించే మొబైల్ ఫోన్లకు అనుకూలంగా తమ మెసేజింగ్ యాప్ పనిచేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సప్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.