
బెర్లిన్: కడుపు నిండినప్పటికీ కొవ్వు పదార్థాలు, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే జంక్‌ఫుడ్‌ను ఎందుకు మానలేకపోతున్నామో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సహజంగా తల్లిపాలల్లో కార్బొహైడేట్లు, కొవ్వు పదార్థాలు అధికస్థాయిలో ఉంటాయి. అదే మోతాదులో బంగాళాదుంపలు, తృణధాన్యాల్లో ఉండటం వల్ల వాటితో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, కేండీ బార్ వంటివి ఎక్కువగా తింటున్నట్లు చెబుతున్నారు.
ఈ కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు మెదడు వ్యవస్థను తీవ్రంగా ప్రభావితంగా చేస్తాయంటున్నారు. ‘పిండి పదార్థాలపై మనం ఆసక్తి పెంచుకోవడానికి కారణం బహుశా తల్లిపాలు కావొచ్చు. ఇది కీలకమైనందువల్ల బ్రెయిన్ రివార్డింగ్ సిస్టమ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ సంస్థ పరిశోధన విభాగానికి చెందిన మార్క్ టిట్జెమెయర్ చెప్పారు.
దీన్ని నిర్ధారించడానికి కంప్యూటర్ గేమ్స్ ఎక్కువగా ఆడే కొంతమంది వాలంటీర్లపై ప్రయోగం చేశారు. అత్యధిక కార్బొహైడ్రేట్లు, కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను వారికి ఇచ్చారు. ఈ పదార్థాలను తిన్న తర్వాత కంప్యూటర్ గేమ్ ఆడే సమయంలో ఇతరులతో పోలిస్తే వీరి బ్రెయిన్ రివార్డింగ్ వ్యవస్థ చురుగ్గా పనిచేయడాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే జంక్‌ఫుడ్ మానలేని బలహీనతకు కారణం వీరు కనుగొన్నారు.