వ్యాపారంపై యోగా ముద్ర
అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో వాణిజ్య, వ్యాపార సంస్థలు.. యోగాకు సంబంధించిన అనేక ఉత్పత్తులు, సేవలతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. యోగా నేర్పించే ఈ-గైడ్లు, చాపలు, ఆధునిక యోగా పరికరాలు, యోగా దుస్తులు వంటి 500 రకాలకు పైగా వస్తువులతో స్నాప్‌డీల్ ఇంటర్నెట్ విక్రయ సంస్థ యోగా స్టోర్‌ను ప్రారంభించింది. ఈ వారంలో 150 పైగా వస్తువులపై ప్రత్యేక రాయితీలు కూడా అందిస్తోంది. అలాగే.. ఆరోగ్య సేవలు అందించే వీఎల్‌సీసీ సంస్థ తన కేంద్రాలన్నింటిలో ఉచిత యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఫ్రీకల్చర్, రీబాక్ వంటి సంస్థలు యోగా టీ-షర్టులు, ఇతర దుస్తులను మార్కెట్‌లోకి తెచ్చాయి. ఈబే వెబ్‌సైట్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్టోర్‌లో యోగా సీడీలు, డీవీడీలను విక్రయానికి పెట్టారు. ఇక యాత్రా.కామ్ వంటి ప్రయాణ వెబ్‌సైట్లు.. వినియోగదారుల కోసం ప్రత్యేక యోగా ప్యాకేజీలు ప్రకటించాయి. ఉత్తరాన హృషికేశ్, దక్షిణాన కోవళం వంటి ప్రాంతాల్లో మూడు నుంచి పది రోజుల యోగా విహార యాత్రల ప్యాకేజీలను ప్రకటించిన యాత్రా.కామ్.. కనీసం రూ. 30,000 నుంచి గరిష్టంగా రూ. 96,500 వరకూ ధరలు నిర్ణయించింది.