
జుకర్‌బర్గ్ విరాళం రూ.20,100 కోట్లు
దాదాపు రూ. 20,100 కోట్లు... ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిస్కిల్లా చాన్‌లు వచ్చే పదేళ్లలో వ్యాధుల నిర్మూలనకు వెచ్చించనున్న మొత్తం...
- వచ్చే పదేళ్లలో వ్యాధులపై పోరుకు వినియోగం
- నివారణకు ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కలిసి పనిచేసేలా ప్రణాళిక
హ్యూస్టన్: దాదాపు రూ. 20,100 కోట్లు... ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిస్కిల్లా చాన్‌లు వచ్చే పదేళ్లలో వ్యాధుల నిర్మూలనకు వెచ్చించనున్న మొత్తం... గతేడాది డిసెంబర్‌లో తమ సంపదలో 99 శాతాన్ని ధార్మిక కార్యకలాపాలకు ఇస్తామంటూ జుకర్‌బర్గ్ దంపతులు ప్రకటించిన అనంతరం వేసిన మొదటి అడుగు ఇది. ఈ శతాబ్దం చివరి నాటికి అన్ని వ్యాధుల్ని రూపుమాపాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యం సాధించే క్రమంలో గురువారం ఈ భారీ విరాళం ప్రకటించారు. ఇందులో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో చాన్-జుకర్‌బర్గ్ బయోహబ్ పేరిట పరిశోధన కేంద్రం కోసం రూ. 4,020 కోట్లు ఖర్చుపెడతారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌ఫ్రాన్సిస్కో మెడికల్ సెంటర్(యూసీఎస్‌ఎఫ్), స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలతో కలిసి చిన్నారుల్లో వ్యాధుల నిర్మూలనకు ఈ పరిశోధన సంస్థ కలిసి పనిచేస్తుంది.
‘చాన్ జుకర్‌బెర్గ్ ఇనీషియేషన్’ ప్రణాళికలో భాగంగా మొదటి దశను శాన్ ఫ్రాన్సికోలో యుసీఎస్‌ఎఫ్ మిషన్ బే క్యాంపస్‌లో జుకర్‌బర్గ్, చాన్‌లు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. మరణాలకు కారణమవుతున్న గుండె జబ్బులు, క్యాన్సర్, అంటు వ్యాధులు, న్యూరో వాధుల నివారణలో అత్యాధునిక ఆవిష్కరణల కోసం.. కొత్త పరికరాల్ని వేగంగా ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు కలిసికట్టుగా తయారుచేయడమే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ‘నాలుగు రకాల వ్యాధులు అత్యధిక మరణాలకు కారణమవుతున్నాయి. సరైన సాంకేతికతతో మనం వాటిపై విజయం సాధించగలం’ అని తెలిపారు. మెదడుపై మరింత పరిశోధనకు కృత్రిమ తె లివితేటలపై, క్యాన్సర్ జీన్స్ గుర్తించేందుకు యంత్ర విజ్ఞానం, అంటువ్యాధుల్ని పసిగట్టేందుకు కంప్యూటర్ చిప్స్, అలాగే రక్తప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించే పరికరాలపై పెట్టుబడులు అవసరమని చెప్పారు. పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఈ ప్రక్రియను ప్రారంభించామన్నారు. ‘ఇది మనందరం కోరుకునే మన పిల్లల భవిష్యత్తు కోసమే’ అని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.
గతాన్ని తలచుకుని కన్నీటి పర్యంతమైన చాన్
మన పిల్లల జీవితకాలంలో అన్ని వ్యాధుల్ని నయం చేయడం, నివారణకు కలిసికట్టుగా పనిచేయడమే లక్ష్యమని పిల్లల వైద్య నిపుణురాలైన చాన్ చెప్పారు.. ‘మా చిన్నారికి నయంకాని వ్యాధి ఉంది లేదా బతికించుకోలేక పోయామంటూ ఎంతో మంది తల్లిదండ్రులు చెప్పేవారు’ అంటూ గత అనుభవాల్ని తలచుకుని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ శతాబ్దం చివరికి చిన్నారుల ప్రాణాలు కాపాడేలా ఆ అనుభవాలు... కొత్త పరికరాల రూపకల్పన కోసం శాస్త్రవేత్తలు, ఇంజినీర్లతో కలిసి పనిచేసేలా ద్రుఢనిశ్చయాన్ని మరింత పెంచిందని చెప్పారు. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు కలిసికట్టుగా కృషిచేయడంతో పాటు విజ్ఞాన ర ంగంలో మరింత సహకారం, నూతన పరికరాల రూపకల్పన, మరింత అత్యాధునిక సాంకేతికత, ఇతర ప్రాజెక్టులకు మరిన్ని నిధుల కోసం సహకారంతో సాగడమే లక్ష్యమని జుకర్‌బర్గ్ దంపతులు పేర్కొన్నారు. కొత్త విజ్ఞానం కోసం అన్ని విధాల పరిశోధనా పరికరాలు కనుగొనేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఇప్పటికే పిల్లల విద్యాభివృద్ధి కోసం చాన్-జుకర్‌బర్గ్ సంస్థ కృషి చేస్తోంది.
సాహసంతో కూడిన ప్రతిష్టాత్మక కార్యక్రమం.. గేట్స్: ఈ శతాబ్ది చివరినాటికి అన్ని వ్యాధుల నివారణ, నియంత్రణ అనేది చాలా ధైర్యం కూడిన ప్రతిష్టాత్మక కార్యక్రమని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అన్నారు.