పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతిరోజు ఉదయం.. సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు కాస్త ఆహారం అందిస్తే చదువుపై శ్రద్ధ పెడతారని భావించారు ఉన్నతాధికారులు. అల్పాహారం రూపంలో టీ, స్నాక్స్, ఉప్మా వంటి ఆహారం అందించాలని నిర్ణయించారు. అయితే దాతలెవరూ ముందుకురాకపోవడంతో జిల్లావ్యాప్తంగా విద్యార్థులు ఆకలితోనే చదువుకుంటున్నారు.
కరీంనగర్‌ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని, అవసరమైతే ఆర్‌ఎంఎస్‌ఏ (రాజీవ్ సర్వశిక్ష అభియాన్) నిధులు వెచ్చించుకోవచ్చని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ మేరకు డిసెంబర్ 28న కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో.. ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో సమావేశమయ్యారు. మార్చిలో జరిగే పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటలవరకు నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో భాగంగా విద్యార్థులకు అల్పాహారం అందించాలని సూచించారు. అయితే ఆ ఖర్చుకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రత్యేక నిధులు ఏమీలేవని, ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల నుంచి వాడుకోవచ్చునని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మిగతాచోట్ల వీలునుబట్టి పాఠశాల యాజమాన్య కమిటీలు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి అల్పాహారం అందించేలా చూడాలన్నారు.
కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి 22 రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఎక్కడా అల్పాహారం అందిస్తున్న దాఖలాలు లేవు. దీంతో విద్యార్థులు ప్రత్యేక తరగతులకు ఖాళీ కడుపులతోనే హాజరవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 148 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 4,850 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. విద్యార్థులకు ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. పాఠశాలల్లో నవంబర్ నుంచి ఒకపూట, డిసెంబర్ నుంచి మార్చి 10 వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. తరగతుల నిర్వహణ విద్యార్థుల హాజరును వారంవారం పర్యవేక్షించేందుకు అధికారులను సైతం నియమించింది. ఉపాధ్యాయుల సహకారం, విద్యార్థుల శ్రమ, విద్యాశాఖ ప్రణాళికలు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో విధానాలు అమలు కాకపోవడంతో గ్రామీణప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు అల్పాహారం లేక ఆకలితోనే చదువులు వెళ్లదీస్తున్నారు. సాయంత్రం బడి ముగియగానే గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండడంతో మధ్యాహ్నం తిన్న భోజనంతో నీరసించిపోతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహరం పెట్టే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు సైతం పట్టింపు లేకుండా దాతల సహకారం కోసం వేచిచూస్తుండడం తో కాలం గడిచిపోతోంది.
వీరే ఆదర్శం
♦ కరీంనగర్ నగరంలోని 16 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మేయర్ రవీందర్‌సింగ్ గతేడాది సరస్వతీప్రసాదం పేరిట దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఆ నిధులతో విద్యార్థులకు అల్పాహారం అందించారు.
♦ గంగాధర మండలం ఒద్యారంలో సర్పంచ్ కూనబోయిన అమ్మాయిసత్తయ్య సహకారంతో విద్యార్థులకు గతంలో అల్పాహారం అందించారు. ఈ ఏడాది కూడా అందిస్తున్నారు.
♦ తిమ్మాపూర్ మండలం నల్లగొండ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులే చొరవ తీసుకుని అల్పాహారం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment