సాయం చేసిన అతనిపైనే ఫిర్యాదు! | Baba ka Dhaba Owner Filed Case Against YouTuber Gaurav Wasan | Sakshi
Sakshi News home page

సాయం చేసిన అతనిపైనే ఫిర్యాదు చేసిన ఢిల్లీ వృద్ధజంట!

Published Mon, Nov 2 2020 9:26 AM | Last Updated on Mon, Nov 2 2020 10:05 AM

Baba ka Dhaba Owner Filed Case Against YouTuber Gaurav Wasan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఉంటున్న ఒక వృద్ధ జంట కరోనా టైంలో తమ ధాబా బిజినెస్‌ సరిగా జరగడం లేదంటూ కంటతడి పెట్టుకున్న వీడియో ఆ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు సైతం‘బాబా కా ధాబా కు వెళ్లి తినండి అంటూ ట్వీట్‌లు చేశారు. దీంతో ఆ ధాబా పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. చాలా మంది అక్కడి వెళ్లి రోటి, కూర్మ కూర రుచి చూసి వచ్చారు. దీంతో పాటు ఆ ధాబా నడుపుతున్న వృద్ధ జంట కాంతా ప్రసాద్, అతని భార్య బాదామి దేవి ఆవేదన చూసి చలించిపోయిన చాలా మంది నెటిజన్లు వారికి ఆర్ధిక సాయం కూడా చేశారు. ఈ వీడియోను ఫుడ్‌ బ్లాగర్‌ గౌరవ్‌ వాసన్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనే వీరి కోసం విరాళాలు సేకరించాడు.

అయితే సాయం చేసిన అతనిపైనే ఇప్పుడు కాంతా ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు సాయం చేయడం కోసం చాలా మంది పంపిన డబ్బును వాసన్‌ తప్పుదోవ పట్టించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు కేవలం రూ. 2.3 లక్షలు మాత్రమే ఇచ్చాడని మిగిలిన డబ్బును అతనే తీసుకున్నాడని ఆరోపించాడు. వాసన్‌ విరాళాలు సేకరించడానికి తన బ్యాంక్‌ ఖాతాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు కూడా ఇచ్చాడని కాంతా ప్రసాద్‌ తెలిపారు. వచ్చిన విరాళాలు మొత్తాన్ని తమకు అందించకుండానే.. ‘ఇచ్చాను అంటూ’ అబద్ధాలు చెబుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాసన్‌ మాత్రం తనకు వచ్చిన ఫండ్స్‌ అన్నింటిని కాంతా ప్రసాద్‌కు ఇచ్చానని బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు చూపిస్తూ మరో వీడియో విడుదల చేశాడు. 

చదవండి: కొన్ని లైకులు... కాస్త వెలుతురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement