
క్రిష్ణగిరి (సూళగిరి): క్రిష్ణగిరి జిల్లా మత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్, ప్రత్యేక బృందం సబ్ ఇన్‌స్పెక్టర్‌ల మధ్య ఏర్పడిన గొడవల్లో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. గాయాలపాలైన వీరు మత్తూరు ఫ్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్రిష్ణగిరి జిల్లా మత్తూరు పోలీస్‌స్టేషన్‌లో తేని జిల్లాకు చెందిన రామ్ ఆండవర్(53) ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు సేలం, హొగేనకల్ పోలీస్‌స్టేషన్‌లలో పనిచేశాడు. మత్తూరు పోలీస్‌స్టేషన్‌లో పోచ్చంపల్లి సమీపంలోని జింగల్‌కదిరంబట్టి గ్రామానికి చెందిన పార్థిభన్(52) ప్రత్యేక బృందం సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
బుధవారం ఉదయం పార్థిభన్ యూనిఫాం ధరించక కుండా ఆలస్యంగా విధులకు రావడంతో ఇన్ స్పెక్టర్ నిలదీశాడు. దీంతో వీరిమధ్య గొడవ జరిగింది. ఈ గొడవల్లో ఆవేశం చెందిన ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకొన్నారు. గాయాలపాలైన వీరిని తోటి ఉద్యోగులు మత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకొన్న జిల్లా ఎస్పీ మహేస్‌కుమార్ విచారణ చేపట్టాలని ఊత్తంగేరి డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.