
రింగ్‌రోడ్డులో ఇంకా మట్టితో చదును చేయని దృశ్యం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం క్షేత్రంలో జరిగే ప్రత్యేక పర్వదినాల్లో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తరాదని అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. పనులు నత్తతో పోటీ పడుతుండటంతో ఇంకా మట్టి చదును చేసే పనులు కూడా పూర్తికాలేదు. శివరాత్రి నాటికి పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఈ ఏడాది కూడా వాహనదారులకు కష్టాలు తప్పేలా లేవు. సుమారు రూ.66కోట్ల వ్యయంతో ఆరు కి.మీ. రోడ్డును మూడు నెలల క్రితం ప్రారంభించిన పనులు ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని ఆదేశాలున్నాయి. మరో వారం రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుంటే కొన్నిచోట్ల మట్టి చదును పనులు కూడా పూర్తికాలేదు. కొన్నిచోట్ల గృహాలు అడ్డంరావడంతో దేవస్థానం అధికారులు, కాంట్రాక్టర్లు ఏమి చేయలేని పరిస్థితి.
మరికొన్నిచోట్ల 100 మీటర్ల వెడల్పు వేయలేక 80 మీటర్లకే చేయాల్సి వస్తోంది. రింగ్‌రోడ్డులోకి ప్రవేశించే ముందు కల్వర్టు పనులు జరుగుతూనే ఉన్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి మల్లమ్మ కన్నీరు, గోశాల, తెలుగు విశ్వవిద్యాలయం, వర్క్‌షాపు, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా దేవస్థానం టోల్‌గేట్ వరకు నిర్మించాలి. ఇప్పటివరకు దేవస్థానం గ్యాస్ గోదాము నుంచి తెలుగు విశ్వవిద్యాలయం వరకు మట్టితో చదును చేసి కంకరవేసే పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు అడ్డంకిగా మారాయి. అలాగే 14 కల్వర్టులకు గానూ 6 మాత్రమే చివరిదశకు చేరుకున్నాయి. శివరాత్రి నాటికి పనులు కొలిక్కి రాకపోతే వాహనాల మళ్లింపు ప్రక్రియ పోలీసులకు సవాలుగా మారే అవకాశముంది. అయితే మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాల అనంతరం బీటీ రోడ్డు పనులు ప్రారంభించాలని అధికారవర్గాలు భావిస్తున్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment