సాక్షి,న్యూఢిల్లీ: పద్మావతి చుట్టూ ముసురుకున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. డిసెంబర్ 1న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న క్రమంలో విడుదలకు ముందు ప్రత్యేక కమిటీ కోసం మూవీని ప్రదర్శించేందుకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అంగీకరించినట్టు సమాచారం. చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ పద్మావతి మూవీపై గత కొద్దిరోజులుగా రాజ్‌పుట్ సంఘాలు, హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. చిత్రంలో అభ్యంతరకర దృశ్యాలుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, థియేటర్లను దగ్ధం చేస్తామని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు.
విడుదలకు ముందు తమకు చిత్రాన్ని ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ ముంబయిలో భన్సాలీ కార్యాలయాన్ని అఖండ్ రాజ్‌పుటానా సేవా సంఘ్ కార్యకర్తలు ముట్టడించారు. సెన్సార్‌కు వెళ్లే ముందుగానే తమకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేశారు. పద్మావతిపై నెలకొన్నవివాదాలకు స్వస్తి పలికేందుకు సినిమాను ప్రత్యేక కమిటీకి ప్రదర్శించేందుకు భన్సాలీ అంగీకరించినట్టు తెలిసింది.
నవంబర్ 15 నుంచి 18 మధ్య సినిమాను తమకు ప్రదర్శిచేందుకు భన్సాలీ సిద్ధమని ఆయన తరపు ప్రతినిధులు తమకు స్పష్టం చేశారని రాజ్‌పుట్ సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడు మహవీర్ జైన్ వెల్లడించినట్టు మిడ్‌డే వెబ్‌సైట్ పేర్కొంది.దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
Comments
Please login to add a commentAdd a comment