అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే..
అత్యాచారాల బారి నుంచి బయటపడ్డప్పుడే మహిళలకు పూర్తి స్వాతంత్య్రం వచ్చినట్లు అని నటి తాప్సీ వ్యాఖ్యానించారు. బోల్డ్ నటీమణుల్లో ఢిల్లీ బ్యూటీ తాప్సీ ఒకరు. తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషా నాయకిగా గుర్తింపు పొందిన ఈ భామ ప్రస్తుతం హిందీ చిత్రాల పైనే పూర్తి దృష్టి సారిస్తున్నారు. మహిళల స్వాతంత్య్రం గురించి ఆ బ్యూటీ ఒక భేటీలో పేర్కొంటూ ఒక మహిళ ఎప్పుడైతే అర్ధరాత్రి ఒంటరిగా నడవ గలుగుతుందో అప్పుడే స్త్రీలకు పూర్తి స్వాతంత్య్రం వచ్చినట్లు అని బాబూజీ అన్న విషయం తెలిసిందేనన్నారు.
అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నిర్భయను కిరాతక గుంపు నాశనం చేసిన సంఘటనను మరిచిపోగలమా? అన్నారు. ఎక్కడ చూసినా మహిళా అరాచకాలేనన్నారు. మానభంగాలకు గురవుతున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు లేని ఇండియాను చూడాలని ఆశపడుతున్నట్లు నటుడు అమితాబ్‌బచ్చన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఆశ తనకూ ఉందన్నారు. అత్యాచారాల బారి నుంచి బయట పడిన ప్పుడే మహిళలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు అని పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలన్నారు.
తాను పింక్ అనే హిందీ చిత్రంలో మానభంగానికి గురైన యువతిగా నటించాన ని చెప్పారు. ఆ పాత్రలో నటించినప్పుడు మానభంగానికి గురయ్యే మహిళలు ఎంత కష్టపడతారన్నది అర్థమైందన్నారు. తాను షూటింగ్‌లో ఏడ్చేశానని, ఇది షూటింగే కదా అని యూనిట్ వర్గాలు సముదాయించారని తెలిపారు. మహిళలు రక్షించబడాలి, గౌరవించబడాలి అని అన్నారు. పింక్ చిత్రం చూసిన వారు అత్యాచారానికి గురైన ఒక స్త్రీ మనోవేదనను అర్థం చేసుకుంటారని, ఇలాంటి అత్యాచారాలు తగ్గుతాయనే అభిప్రాయాన్ని తాప్సీ వ్యక్తం చేశారు.