
వెయ్యి కోట్లతో రాజమౌళి మహాభారతం?
దర్శకుడు రాజమౌళిని ఇప్పుడు ఒక భాషకు చెందిన దర్శకుడిగా భావించలేం
చెన్నై : దర్శకుడు రాజమౌళిని ఇప్పుడు ఒక భాషకు చెందిన దర్శకుడిగా భావించలేం.అందుకు కారణం బాహుబలి చిత్రం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ సినిమాను తనవైపు తిరిగి చూసేలా చేసిన చిత్రం బాహుబలి. ఆ గ్రాండీయర్‌ను, ఆ గ్రాఫిక్స్‌ను భారతీయ సినిమా ఇంతకు ముందెప్పుడూ చూడలేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
ఆ చిత్ర సృష్టికర్త బాహుబలి-2ను అంతకు మించిన బ్రహ్మాండంగా సెల్యులాయిడ్ పెకైక్కించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ చిత్రం తరువాత మహేశ్‌బాబు, అల్లుఅర్జున్‌లతో చిత్రాలు చేయనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆ రెండు చిత్రాల తరువాత రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని చిత్రంగా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో తెరపై ఆవిష్కరంచడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పేర్కొనట్లు ప్రచారం జరుగుతోంది. దానికి గరుడా అని పేరును కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో జూనియర్ ఎన్‌టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం ఉన్నట్లు, మరో ముఖ్య పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదన్నది గమనార్హం.