రజనీ కూడా సై అంటున్నారు!
సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుకు నిన్న కాక మొన్న కమల్‌హాసన్ మద్దతు పలికితే.. ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీ కాంత్ కూడా దన్నుగా నిలిచారు. సుప్రీంకోర్టు వద్దన్నా, ఎవరు వద్దన్నా కూడా తమిళుల సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టును ఆడాల్సిందేనని అంటున్నారు. ఎన్నో శతాబ్దాలుగా జల్లికట్టు ఆట ఉందని, తమిళుల సంస్కృతిలో భాగంగా దాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పారు.
వికటన్ సినిమా అవార్డుల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందులో కావాలంటే ఎన్ని నిబంధనలైనా పెట్టుకోవచ్చు గానీ, జల్లికట్టును మాత్రం కొనసాగించాలని చెప్పారు. జల్లికట్టు మీద నిషేధం విధించాలంటే బిర్యానీని కూడా నిషేధించాలని కమల్ అన్న విషయం తెలిసిందే. తమిళులు దేన్నయినా వదులుకుంటారు గానీ, సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టును మాత్రం కొనసాగించాల్సిందేనని చెబుతారు. ఇప్పటికే ధనుష్, శింబూ, జీవీ ప్రకాష్, ఆర్‌జే బాలాజీ, ఖుష్బూ లాంటి చాలా మంది దీనికి మద్దతు పలికారు.