ఇలా ఎగబడడం దారుణం!
ఇది సెల్ఫీల ట్రెండ్. బెస్ట్ ఫ్రెండ్‌తో సెల్ఫీ... ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లతో సెల్ఫీ... పిచ్చి పిచ్చి హావభావాలిస్తూ సెల్ఫీ... ఇలా కాదేదీ సెల్ఫీకి అనర్హం అన్నట్లుగా ఉంది. అంతమటుకు ఫర్వాలేదు కానీ.. అంతకుమించి చేస్తేనే పిచ్చి ముదిరింది అనాలనిపిస్తుంటుంది. అమితాబ్ బచ్చన్ ఆ మాటే అంటున్నారు. ఇటీవల ఫ్రెండ్ చనిపోతే, అంతిమక్రియల్లో పాలుపంచుకోవడానికి అమితాబ్ ఢిల్లీ వెళ్లారు. ఇది హఠాన్మరణం అని, అస్సలు ఊహించలేదని ఈ సందర్భంగా బిగ్ బి పేర్కొన్నారు. ఫ్రెండ్ పోయిన బాధలో ఉన్న ఆయన్ను మరో విషయం విపరీతంగా బాధపెట్టింది. అంతిమక్రియల్లో పాలుపంచుకోవడానికి వెళ్లిన అమితాబ్‌తో సెల్ఫీలు దిగడానికి చాలామంది ఎగబడ్డారట. ‘‘మరణించినవారికీ మర్యాద ఇవ్వడం లేదు.. వాళ్ల చివరి క్రియలను దగ్గరుండి చేయడానికి హాజరయ్యే బతికున్నవాళ్లకీ మర్యాద లేదు. సమయం, సందర్భం కూడా పట్టించుకోకుండా సెల్ఫీల కోసం ఎగబడటం దారుణం’’ అని అమితాబ్ ఆవేదన వ్యక్తం చేశారు.