
అనైకా సాటి
సినిమా : నటుడు సంతానంతో బాలీవుడ్ బ్యూటీ అనైకా సాటీ రొమాన్స్ చేయనుంది. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు సంతానం. ఈయన నటించిన డగాల్టీ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. మరో చిత్రం సర్వర్‌సుందరం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా కన్నన్ దర్శకత్వంలో నటిస్తున్న బిస్కోత్, కార్తీక్ యోగి దర్శకత్వంలో నటిస్తున్న డిక్కిలోనా చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి.
కాగా సంతారం కొత్త చిత్రానికి రెడీ అయ్యాడు. జాన్సన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కాగా ఈ దర్శకుడితో ఇంతకు ముందు ఏ 1 అనే సక్సెస్‌ఫుల్ చిత్రంలో సంతానం నటించారు. తాజాగా రెండోసారి జాన్సన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా బాలీవుడ్ గ్లామరస్ నటి అనైకా సాటి నటిస్తోంది. ఈ అమ్మడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సత్య 2 చిత్రంలో నటించి అందాలను ఆరబోసింది. ఆ తరువాత తమిళంలో కావ్యవతలైవన్, ఆధర్వకు జంటగా సెమ్మబోద ఆగాదే చిత్రాలలో నటించింది. చిన్న గ్యాప్ తరువాత ఇప్పుడు సంతానంతో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇతర వివరాలు వెల్లడించాల్సి ఉంది.